సిటీబ్యూరో, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ప్రజా చైతన్యం కోసం అహర్నిషలు శ్రమించి, తన గళంతో లక్షలాది మందిలో చైతన్యాన్ని రగిల్చిన విప్లవ వీరుడు గద్దర్ (గుమ్మడి విఠల్ రావు) ఇక లేడన్న నిజాన్ని అభిమాన జనం జీర్ణించుకోలేకపోతున్నారు. గద్దర్ మృతి సమాజానికి తీరనిలోటని సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అభిమానులు, సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక సమస్యలపై పాట కట్టి, కాలుకు గజ్జెకట్టి ఆడిపాడిన గద్దర్.. విద్యార్థి నుంచి వయోజనుల వరకు రంజింపజేసి, సామాన్యులలో పోరాట స్ఫూర్తిని రగిల్చారు. అలాంటి గద్దర్ మరణం కవులు, గాయకులు, సాహితీవేత్తలు, ప్రజలను తీవ్రంగా కలిచివేసింది. ప్రభుత్వ అధికార లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు నిర్వహించనున్న నేపథ్యంలో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సోమవారం మధ్యాహ్నం వరకు ఆయన పార్థివ దేహాన్ని సందర్శన కోసం ఉంచారు.