సిటీబ్యూరో, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): ఫ్లె ఓవర్లు..ఆర్వోబీ..ఆర్‌యూబీలు, రహదారులు, నాలాల విస్తరణ..లింకు రోడ్లు, జంక్షన్ల అభివృద్ధి పనులకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ సీసీపీ కె.శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏడాదిలో ప్రభుత్వం కేటాయించిన రూ. 200 కోట్ల స్పెషల్ ఫండ్‌తో రహదారుల విస్తరణ పనులు చేసినట్లు పేర్కొన్నారు. డబీర్‌పుర పోలీస్ స్టేషన్ నుంచి నాగబౌలి వరకు, షేక్ ఫయాజ్ కమాన్ నుంచి డబీర్‌పుర ఫ్లై ఓవర్ వరకు, బడా బజార్ రోడ్ నుంచి భవానీ నగర్ వరకు, శాస్త్రిపురం జంక్షన్ నుంచి ఫలక్‌నుమా బస్ డిపో వరకు రహదారుల విస్తరణ పనులకుగానూ ముందస్తుగా ఆస్తులను స్వాధీనం చేసుకుని భూసేకరణ ప్రకియను విజయవంతం చేసినట్లు చెప్పారు.
ఈ పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయన్నారు. ప్రభుత్వం హెచ్ సిటీ ప్రాజెక్టును ప్రకటించి 38 చోట్ల పనులు చేపట్టనున్నట్లు, ఇందుకు భూ సేకరణ జరపనున్నామని తెలిపారు. 27 చోట్ల రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ (ఆర్డీపీ) అనుమతి పొందగా, 11 చోట్ల పురోగతిలో ఉన్నాయన్నారు. జంక్షన్ల అభివృద్ధిలో భాగంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్, పోలీస్ శాఖ సమన్వయంతో పనులు చేసినట్లు సీసీపీ చెప్పారు. ఈ ఏడాదిలో హెచ్ సిటీ, జంక్షన్ల అభివృద్ధి పనులను ట్రాఫిక్, టీజీ ఎస్పీడీసీఎల్ అధికారులతో కలిసి పనిచేస్తామని శ్రీనివాస్ తెలిపారు.