బంజారాహిల్స్, జూలై 22: బంజారాహిల్స్ రోడ్ నం. 1లోని జలగం వెంగళరావు పార్కు చెరువులోకి మురుగునీరు రాకుండా ప్రత్యేకంగా చేపట్టిన పైపులైన్ పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో చెరువులో వర్షపునీరు మాత్రమే వస్తుండడంతో సుందరీకరణపై దృష్టి పెట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం జలగం వెంగళరావు పార్కులో పర్యటించిన ఆయన వాకర్లతో ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
చెరువులో ఫౌంటెయిన్లు, బోటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వాకింగ్ ట్రాక్‌లో మరమ్మతులను చేయడంతో పాటు దెబ్బతిన్న బెంచీలు, కుర్చీలను తక్షణమే మార్చాలన్నారు. అనంతరం బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు మెయిన్ గేట్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దాకా వాక్‌వేతో పాటు పార్కింగ్ ప్రదేశాలను కమిషనర్ పరిశీలించారు. కార్యక్రమంలో జీహెచ్ంఎసీ అదనపు కమిషనర్ కృష్ణ, జోనల్ కమిషనర్ రవికిరణ్, డీఎంసీ ప్రశాంతి, సర్కిల్ -18 ఈఈ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.