బాలానగర్, ఆగస్టు 30: క్రెడిట్లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్‌ను (సీఎల్సీఎస్ఎస్) అన్ని వర్గాల వారికి అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తానని కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ సహాయ మంత్రి భానుప్రతాప్ సింగ్ వర్మ అన్నారు. మంగళవారం బాలానగర్ నర్సాపూర్ చౌరస్తాలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ)ను మంత్రితో పాటు ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ కమిషనర్ శైలేశ్‌కుమార్ సింగ్, ఎంఎస్ఎంఈ అడిషనల్ డెవలప్మెంట్ కమిషనర్ చంద్రశేఖర్, పలు పారిశ్రామికవేత్తలు సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థ ఆడిటోరియం హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు పారిశ్రామికవేత్తలు మాట్లాడారు. పారిశ్రామిక రంగం అభివృద్ధికి పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి భానుప్రతాప్ సింగ్ వర్మ మాట్లాడుతూ.. పారిశ్రామిక రంగం మరింత వృద్ధిలోకి రావడానికి కావాల్సిన అంశాలను పరిగణలోకి తీసుకొని తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఎంవీ. సుధీర్ కుమార్, సంస్థ తెలంగాణ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ అధ్యక్షుడు సుధీర్‌రెడ్డితో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
సీఐటీడీలో..
సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ)ను మంత్రి భానుప్రసాద్ సింగ్‌వర్మ సందర్శించారు. సీఐటీడీలో ఏయే కోర్సులు నిర్వహిస్తున్నారు..? ఎంతమంది విద్యార్థులు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు.. అన్న వివరాలను సంస్థ అధికారుల నుంచి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఐటీడీలో ప్రధానంగా క్యాడ్క్యామ్, పీజీటీడీ, 3డీ పెయింటింగ్, ఇండస్ట్రీ 4.0, డిప్లోమా కోర్సులు, పీజీ కోర్సులలో బోధన చేస్తున్నట్లు సీఐటీడీ ప్రిన్సిపాల్ డైరెక్టర్ జె.బ్రహ్మేశ్వరయ్య తెలిపారు. అనంతరం సంస్థ ప్రాంగణంలో మంత్రి మొక్కలు నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో సంస్థ డిప్యూటీ డైరెక్టర్లు సనత్‌కుమార్, వెంకటకృష్ణ, అసిస్టెంట్ డైరెక్టర్లు ఎస్.రామకృష్ణ, ఎం.ఉదయ్‌కుమార్, బాబూరావు, అనిల్‌తోపాటు సంస్థ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.