జూబ్లీహిల్స్, మార్చి11: ప్లాస్టిక్ ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా పర్యావరణహిత ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని నిమ్స్‌మే డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎస్.గ్లోరి స్వరూప పేర్కొన్నారు. ప్లాస్టిక్ వస్తువులతో పర్యావరణానికి పెనుముప్పు పొంచి ఉన్నదని అన్నారు. ఒకసారి వాడి పడేస్తున్న ప్లాస్టిక్ వస్తువులను ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిషేధించేందుకు రంగం సిద్ధం చేసిందని తెలిపారు. శుక్రవారం యూసుఫ్‌గూడలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఆడిటోరియంలో ‘సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్స్ అండ్ ఆల్టర్నేటివ్ మెటీరియల్స్’ అనే అంశంపై జరిగిన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ప్లాస్టిక్ ఉత్పత్తులపై ఆధారపడ్డ పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు నూతన పద్ధతులు అవలంబించి ప్రత్యామ్నాయ ఉత్పత్తులపై దృష్టి సారించాలని సూచించారు. నిమ్స్‌మే వర్క్‌షాప్ డైరెక్టర్ జె.కోటేశ్వరరావు అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో సీనియర్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ డి.నరేంద్రకుమార్, ఏఐపీఎంఏ దక్షిణాది ఉపాధ్యక్షుడు వి.అనిల్ రెడ్డి, తెలంగాణ-ఏపీ అధ్యక్షుడు విమలేశ్ గుప్త, స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్లు ఎం.సూర్యనారాయణ, విశాల, ఎన్ఎస్ఐసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ బి.విష్ణుమూర్తితో పాటు పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.