ప్రజా పాలన అంటూ.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. నగర ‘ప్రగతి’ని అటకెక్కించింది. రెండేండ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టూ అడుగుపడలేదు. అభివృద్ధి మాట అనేది కాగితాలకే పరిమితమైంది. బడ్జెట్ కేటాయింపుల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన గొప్ప ప్రకటనలు.. ఆచరణలో మాత్రం కనిపించలేదు. బీఆర్ఎస్ హయాంలో గ్రేటర్లో ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారానికి ఎస్ఆర్డీపీ కింద చేపట్టిన ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఏదైనా ప్రాజెక్టుకు టెండర్ పిలిస్తే చాలు… ఆ పనులను దక్కించుకునేందుకు పదుల సంఖ్యల్లో ఏజెన్సీలు పోటీ పడేవి. పనులకు చిన్న కాంట్రాక్టర్ల నుంచి బడా కాంట్రాక్టర్లు సైతం టెండర్ ప్రక్రియలో పాల్గొని పనులు దక్కించుకునేవారు. ఫ్లె ఓవర్లు, అండర్‌పాస్‌లు, ఆర్వోబీ, ఆర్యూబీ పనుల్లో భాగంగా అప్పటి ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రాజెక్టులను నిర్ణీత గడువుకు ముందే పూర్తి చేశారు.
ముందుకు రాని ఏజెన్సీలు..
ఎస్ఆర్డీపీని హెచ్సిటీగా పేరు మార్చిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా ప్రకటించారు. అంతేకాదు గతేడాది డిసెంబర్లో కేబీఆర్ పార్కు చుట్టూ రూ. 1,070 కోట్ల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పటి వరకు పనులు మొదలు కాకపోవడం సర్కారు పనితీరుకు నిదర్శనం. ఇక హెచ్సిటీ ప్రాజెక్టు కింద రూ. 7,032 కోట్లతో 58 చోట్ల ఫ్లెఓవర్లు, అండర్‌పాస్‌లు, ఆర్వోబీలు, ఆర్‌యూబీలు, రహదారుల విస్తరణ పనులకు విడతల వారీగా టెండర్లు పిలుస్తున్నా.. పనులు దక్కించుకునేందుకు ఏజెన్సీలు ముందుకు రావడం లేదు.
ప్రభుత్వంపై నమ్మకం లేక..
హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా 38 చోట్ల పనుల్లో భాగంగా ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, ఆర్వోబీలు, ఆర్‌యూబీలు, రహదారుల విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఇందుకు రూ. 7,032 కోట్లు ఖర్చు చేయనున్నారు. 28 ఫ్లై ఓవర్లు, 13 అండర్‌పాస్‌లు, నాలుగు ఆర్వోబీలు, మూడు చోట్ల ఆర్‌యూబీలు, పది చోట్ల రహదారుల విస్తరణ పనులకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాల్సి ఉండగా, నేటికీ టెండర్ దశలోనే ఉన్నాయి. 13 చోట్ల పనులకు టెండర్లు పిలవగా, వివిధ దశల్లో ఉన్నాయి. మరో 15 చోట్ల పనులకు టెండర్లు పిలిచేందుకు సన్నద్ధమవుతున్నారు. కాగా, 30 చోట్ల పనులకు మాత్రం ప్రతిపాదన దశలోనే ఉండడం గమనార్హం. కాగా, రూ. 780 కోట్ల నిధులు ప్రభుత్వం ఇస్తే తప్ప.. భూ సేకరణ ముందడుగు పడని పరిస్థితి నెలకొంది. అన్నింటికంటే మించి ఇటీవల కాలంలో నానల్‌నగర్, రేతిబౌలి ఫ్లై ఓవర్ల పనులు, కంటోన్మెంట్ ఐవోసీ పనుల టెండర్లకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపకపోవడంతో తిరిగి రీటెండర్ కాల్ చేయడం హెచ్సిటీ ప్రాజెక్టు ఏ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.మొత్తానికి హెచ్సిటీ ప్రాజెక్టును సర్కారు ప్రశ్నార్థకంగా మార్చేసింది.

ట్రాఫిక్ సుడిగుండంలో కీలక జంక్షన్లు
‘హైదరాబాద్ నగరాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం…బడ్జెట్లో రూ.10వేల కోట్లకు పైగా నిధులు ఇచ్చాం…రూ. 7032 కోట్లతో హెచ్ సిటీ ప్రాజెక్టు ద్వారా 58 ప్రాజెక్టులు చేపడుతున్నాం’… బడ్జెట్ కేటాయింపుల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన గొప్ప ప్రకటనలు ఇవీ.. కానీ ఆచరణలో మాత్రం ఎక్కడ కూడా ప్రాజెక్టు పనులు పట్టాలెక్కలేదు. పైగా అధికారుల నిర్లక్ష్యంతో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు జఠిలమవుతున్నది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే వాహనదారుల అవస్థలు అన్నీ ఇన్నీ కావని సోషల్ మీడియా వేదికగా వాహనదారులు మండిపడుతున్నారు. ముఖ్యంగా హైటెక్ సిటీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట,కూకట్పల్లి, సికింద్రాబాద్, బేగంపేట, కోఠి మార్గాల్లో ట్రాఫిక్ సుడిగుండం నుంచి బయటపడాలంటే నరకయాతన తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాగితాలకే పరిమితం
ఈ ప్రాజెక్టుల్లో ఏ ఒక్క చోటా పనులు మొదలు పెట్టలేదు. కొన్ని టెండర్ దశలో ఉండగా, మరికొన్ని టెండర్ దశ దాటి భూ సేకరణ చిక్కుల్లో నలిగిపోతున్నది. మరికొన్ని డీపీఆర్ దశలోనే కాగితాలకు పరిమితం కావడం కాంగ్రెస్ పాలన తీరుకు నిదర్శనం.
ప్రాజెక్టు – హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మెటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు