సిటీ బ్యూరో, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): మూసీ పరీవాహక ప్రాంతాల్లోని బస్తీల నుంచి వెళ్లగొట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని వరద ముంపు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇండ్లపైకి వరద నీటిని కావాలనే వదిలారని అందులో భాగంగానే నాలుగు బస్తీలు పూర్తిగా నీట మునిగిపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారులు స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. వెయ్యికి పైగా కుంటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడితే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులెవరూ అటువైపు కన్నెత్తి చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా పాలన, ఇందిరమ్మ రాజ్యం అని గప్పాలు కొట్టుకుంటున్నారే తప్ప… సర్వస్వం కోల్పోయిన పేద ప్రజలను ఆదుకోవడానికి మాత్రం ముందుకు రావడం లేదని మండిపడుతున్నారు. పేదల ఇండ్లను ముంచి.. కట్టుబట్టలతో రోడ్డున పడేయడమే ఇందిరమ్మ రాజ్యమా? అంటూ నిలదీస్తున్నారు. నాలుగు రోజులుగా చిన్న పిల్లలు, వృద్ధులు ఆకలితో అలమటిస్తున్నా పట్టించుకున్న నాథుడే లేరని ఆందోళన చెందుతున్నారు. మూసానగర్, శంకర్‌నగర్, అంబేద్కర్ నగర్, వినాయక వీధి బస్తీల్లో ఉండేవాళ్లంతా దినసరి కూలీ పనులు, ఆటోలు నడుపుకుంటూ జీవిస్తున్నారని.. ఏడాది పాటు కష్టపడితేనే వరదకు ధ్వంసమైన సామగ్రి కొనుక్కోగలుగుతామని వాపోతున్నారు. ప్రభుత్వం ఎంతో కొంత సహాయం చేసి అండగా ఉండాలని కోరుతున్నారు.
మూసీ పరీవాహక ప్రాంతాల్లోని బస్తీలను ఖాళీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని వరద ముంపు బాధితులు ఆరోపిస్తున్నారు. అందుకే చడీ చప్పడు కాకుండా వరదను వదిలి తమ ప్రాణాలు తీయాలని కుట్ర చేసిందని మండిపడుతున్నారు. ఏండ్ల తరబడిగా మూసీ పరీవాహక బస్తీల్లో నివసిస్తున్నామని. ఎన్నడూ ఏ ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరించలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఇండ్లను ఖాళీ చేయాలని ఏ ప్రభుత్వమూ చూడలేదని అంటున్నారు. రేవంత్‌రెడ్డి అనుకున్నది చేయడం కోసం తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడుతున్నారు. ప్రజల ప్రాణాలకు రక్షణగా ఉండాల్సిన ప్రభుత్వమే వారి జీవితాలతో ఆడుకోవడం అత్యంత దారుణమని కన్నీటి పర్యంతమవుతున్నారు. కాంగ్రెస్ పాలనలో పేద ప్రజలకు రక్షణ లేదని ఆరోపిస్తున్నారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలను కడుపులో పెట్టుకుని చూసుకున్నారని మూసీ పరీవాహక బస్తీ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. మూసీ ఉప్పొంగి ఏ మాత్రం వరదలు వచ్చిన అధికారులు ప్రతి ఇంటికి తిరిగి అప్రమత్తం చేసేవారని అంటున్నారు. జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలిన ప్రతిసారి తమను అప్రమత్తం చేసేవారని చెబుతున్నారు. అర్ధరాత్రైనా అధికారులు వచ్చి పునరావాసాలకు రావాలని సూచించేవారు. నామమాత్రపు వరదలు వచ్చినా ఆహారం, తాగునీరు అందించేవారని గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ వచ్చింది.. తమకు కష్టాలు తెచ్చిందని వాపోతున్నారు. కాంగ్రెస్ సర్కారులో జంట జలాశయాల గేట్లన్నీ ఎత్తి మూసీ మీదకు వరద నీటిని వదిలినా ఏ మాత్రం ముందస్తు సమాచారం ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. తమ ఇండ్లను ముంచేందుకే అధికారులు ఇటువైపు చూడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మూసీ పరీవాహక బస్తీల నుంచి పేదలను వెళ్లగొట్టేందుకు కాంగ్రెస్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నది. మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేస్తే ఇక్కడి నుంచి వెళ్లపోతామని భ్రమ పడుతున్నది. కుట్రలో భాగంగానే జంట జలాశయాల్లో రోజుల తరబడి నీటిని నిల్వచేసి ఒక్కసారే మా ఇండ్ల మీదకు వదిలారు. మూసీ వరద సహజ సిద్ధంగానే వస్తే.. ముందస్తు సమాచారం ఎందుకు ఇవ్వలేదు? ఇదంతా సీఎం రేవంత్‌రెడ్డి పక్కా ప్లాన్‌తోనే చేయించారు. బస్తీలకు పేదలకు సరైన పునరావాసం కల్పించి.. వారి అనుమతితో ఖాళీ చేయించడం ప్రభుత్వ లక్షణం. కానీ సీఎం రేవంత్‌రెడ్డి తీరు నియంతృత్వ పాలనకు ప్రతీకగా నిలుస్తున్నది.
-అంజద్, మూసానగర్ బస్తీ
మూసీ ఆకస్మిక వరదల వల్ల సామగ్రి, నిత్యావసరాలు, దస్తులన్నీ బురదపాలయ్యాయి. భార్యా పిల్లలతో రోడ్డున పడ్డాం. నాలుగు రోజులుగా తీవ్ర అవస్థలు పడుతున్నాం. ఆహారం, తాగునీరు కూడా లేకపోవడంతో పిల్లలు, వృద్ధులు ఆకలితో అలమటిస్తున్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థల వారు ఇచ్చిన కొద్దిపాటి ఆహారంతో బతుకుతున్నాం. ఇప్పటిదాకా ప్రభుత్వ అధికారులు ఇటువైపు రాలేదు. పేద ప్రజలపై ప్రభుత్వం ఇంత క్రూరంగా ఉండటం ఏనాడూ చూడలేదు. కాంగ్రెస్ సర్కారులో సీఎం రేవంత్‌రెడ్డి అన్ని వర్గాల ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారు. నాలుగు రోజులవుతున్నా స్పందించకపోవడం దారుణం.
-ఆజాద్, మూసానగర్ బస్తీ