పహాడీషరీఫ్, ఆగస్టు 26: జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని డ్రీమ్, గ్రీన్‌సిటీ తదితర కాలనీల్లో బాక్స్ డ్రైన్ అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాలనీలవాసులకు మాట ఇచ్చి.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో పెద్దమొత్తంలో నిధులు తీసుకొచ్చి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నారు. దీంతో కాలనీల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ.10.66 కోట్ల వ్యయంతో మున్సిపాలిటీ పరిధిలోని కొత్తమోని కుంట నుంచి గుర్రం చెరువు వరకు 2.5 మీటర్ల వెడల్పు, 1.5 మీటర్ల పొడవుతో 1.72 కిలోమీటర్ల మేర బాక్స్ డ్రైన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు 65 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.
మంత్రికి కృతజ్ఞతలు
భారీ వర్షాల కారణంగా గతంలో తీవ్ర అవస్థలు పడ్డాం. బయటికి వెళ్లాలంటే మోకాలు లోతు నీళ్లు ఉండటంతో చిన్నారులు, వృద్ధులు వెళ్లలేని పరిస్థితి నెలకొని ఉండేది. సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించి నిధులు కేటాయించారు. నేనున్నానంటూ ధైర్యం చెప్పారు. పనులు ప్రారంభించి చురుకుగా సాగుతున్నాయి. సమస్య పరిష్కారానికి కృషి చేసిన మంత్రికి కృతజ్ఞతలు
– మహ్మద్ అబ్దుల్ ఖాన్, డ్రీమ్సిటీ వాసి
భవిష్యత్‌లో ముంపు లేకుండా..
వందేండ్లలో ఎప్పుడూ పడని భారీ వర్షాలు రెండు సంవత్సరాల క్రితం చూశాం. కాలనీ, బస్తీ వాసులు చాలా ఇబ్బందులు పడ్డారు. క్షేత్ర స్థాయిలో పర్యటించినప్పుడు వారి కష్టాలు, బాధలు స్వయంగా చూశాను. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు సమస్యను వివరించాను. దీంతో రూ.10.66కోట్లు మంజూరు చేశారు. త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నాను.
– సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి