Hyderabad | చార్మినార్, జూలై 13: ఓ ఐదుగురు మహిళలు పోలీసుల కళ్లు గప్పి పోలీసు స్టేషన్ నుంచి పరారైన ఘటన పాత నగరంలో చోటు చేసుకుంది. పాతబస్తీలోని పలు ఏరియాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సీసీఎస్ స్పెషల్ పోలీసులు ఆ ఏరియాల్లో దాడులు నిర్వహించి.. బంగ్లాదేశ్‌కు చెందిన ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా వ్యభిచార గృహాల్లో పట్టుబడ్డారు. అదుపులోకి తీసుకున్న మహిళలను సౌత్ జోన్‌లోని మహిళా పోలీసు స్టేషన్‌కు తరలించారు. శనివారం రాత్రి ఆ ఐదుగురిని స్టేషన్లోనే ఉంచి, ఆదివారం ఉదయం న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టాలని పోలీసులు భావించారు. కానీ పోలీసుల అంచనాలను ఆ మహిళలు తారుమారు చేశారు. పోలీసుల కళ్లు గప్పి అక్కడ్నుంచి పరార్ అయ్యారు. పారిపోయిన మహిళల ఆచూకీ కోసం పోలీసులు అక్కడున్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. విషయం ఉన్నతధికారులకు తెలియడంతో భాద్యులైన పోలీసులను మందలించినట్లు సమాచారం.