Rayadurgam | శేరిలింగంపల్లి, మే 3: టికెట్ తీసుకోమన్నందుకు ఆకతాయిలు రెచ్చిపోయారు. కండక్టర్పై విచక్షణారహితంగా దాడికి దిగారు. హైదరాబాద్లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో గచ్చిబౌలి జంక్షన్లో ఐదుగురు వ్యక్తులు బర్కత్పుర డిపోకు చెందిన 216 రూట్ నంబర్ బస్సు ఎక్కారు. వారిలో నలుగురు పురుషులు ముందు నుంచి బస్సు ఎక్కగా.. ఒక మహిళ వెనుక నుంచి బస్సెక్కింది. దీంతో టికెట్ తీసుకోవాలని బస్సు కండక్టర్ ముందు నుంచి ఎక్కిన వాళ్లను అడగ్గా.. వెనుక ఉన్న మహిళ తీసుకుంటారని చెప్పారు. అదే మహిళను అడగ్గా ముందు ఉన్న వారు తీసుకుంటారని చెప్పింది. ఇలా కాసేపు సతాయించడంతో టికెట్ తప్పనిసరిగా తీసుకోవాలని కండక్టర్ చెప్పాడు. దీంతో ఆగ్రయించిన యువకులు కండక్టర్పై దాడికి దిగారు. కండక్టర్పై విచక్షణారహితంగా దాడి చేయడంతో వారిని ఇతర ప్రయాణికులు అడ్డుకున్నారు. అనంతరం బస్సును రాయదుర్గం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఆ ఆకయితాలను పోలీసులకు అప్పగించి, వారిపై ఫిర్యాదు చేశారు. కండక్టర్ మాణిక్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.