సిటీబ్యూరో/రామంతాపూర్, ఆగస్టు 18(నమస్తే తెలంగాణ):గోఖలేనగర్ విషాదఘటన మృతుల కుటుంబాల్లో తీరని వేదనను మిగిల్చింది. బాబుతో ఆడుకుని వెళ్లి మళ్లీ శోభాయాత్రలో పాల్గొని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని ఒకరి భార్య కన్నీరుమున్నీరవుతుంటే చెట్టంత కొడుకును కోల్పోయామంటూ మరో కుటుంబం రోదిస్తోంది. శోభాయాత్రలో పాలుపంచుకుందామని వచ్చిన ఆ ముగ్గురు స్నేహితులు చివరి శ్వాసలోనూ ఒక్కటిగానే గాల్లో కలిసిపోయారు.
బాధిత కుటుంబాలు తమవారి జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ రోదిస్తున్న తీరు అక్కడున్న అందరినీ కంటతడి పెట్టించింది. గోకుల్‌నగర్‌లో ప్రతీ ఇంట్లో ఒకరులా మెదిలే ఆ ఇద్దరు లేరంటే కాలనీ వాసులు నమ్మలేకపోతున్నారు. సురేశ్‌యాదవ్, కృష్ణాయాదవ్ కుటుంబాలు ఉన్నంతలోనే బతుకుతూ తమకు చేదోడువాదోడుగా ఉన్నవారిని కోల్పోవడంతో కన్నీటిపర్యంతమవుతున్నారు.
ఐదునెలల బాబుతో ఎలా బతకాలి..
-సురేశ్‌యాదవ్ కుటుంబసభ్యులు
పళ్లై సంవత్సరంన్నర అయింది. ఐదునెలల బాబు ఉన్నాడు. శోభాయాత్ర మధ్యలో వచ్చి బాబుతో ఆడుకుని పోయిండు. బువ్వతిని గడ్డికి పోయిండు. దోస్తులతో మంచిగుండేటోడు. గణేశ్ నవరాత్రులు, దుర్గానవరాత్రులు, బోనాలు.. ఏది జరిగినా ముందుండేటోడు. అన్ని రోజులు ఒక్కపొద్దులు ఉంటడు. ఏం గ్రహచారమో ఏమో దేవుడు తీసుకుపోయిండు. ఐదునెలలబాబుతో ఈ అమ్మాయి ఎట్లా బతకాలి.. మాకేం ఉన్నది.. ఇంటికి పెద్ద దిక్కే పోయిందంటూ సురేశ్‌యాదవ్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పాల వ్యాపారం చేసే సురేశ్‌యాదవ్ కాలనీలో ఏ ఉత్సవం జరిగినా ముందుండేటోడు. తండ్రి చనిపోయిన తర్వాత తన కుటుంబానికి చేదోడువాదోడుగా నిలిచాడు. యాదవుల పండుగ గ్రాండ్‌గా చేయాలనే మధ్యాహ్నం నుంచే హడావిడి చేసిండని వారు చెప్పారు. మధ్యలో వచ్చి గేదెలకు గడ్డేసి బిడ్డతో ఆడుకుని పోయి మళ్లీ రాలేదన్నారు. తల్లి వృద్ధురాలు కావడంతో ఇప్పుడా కుటుంబానికి దిక్కు లేకుండాపోయిందని స్థానికులు చెప్పారు.
చేతికందొచ్చిన కొడుకు పోయిండు..
కృష్ణాయాదవ్ కుటుంబసభ్యులు
అందరూ కావాలంటడు. అందరికోసం పనిచేసేటోడు. ఉన్న ఒక్క కొడుకు పోయిండు. చేతికందొచ్చినోడిని ఈ చిన్నవయసులో దేవుడు తీసుకుపోయిండు. మా గతేంకాను. మేమెట్లాబతకాలె. అంటూ రోదిస్తున్న రామంతాపూర్ గోకుల్‌నగర్ ఘటనలో మృతిచెందిన కృష్ణాయాదవ్ కుటుంబసభ్యుల శోకం చెప్పనలవికాదు. అందరూ అతనిని డైమండ్గా పిలుస్తారు. ఒక్కరు లేకున్న అందరినీ అడిగేటోడు. 24 ఏళ్లకే చావొచ్చింది. వాళ్ల తల్లిదండ్రులు, నాయనమ్మతో కలిసి ఉంటారు. ఇటీవలే తన చెల్లి పెళ్లి చేశారు.
మంచి సంబంధం వచ్చిందని లోన్ చేసి మరీ వివాహం గ్రాండ్‌గా జరిపించాడు. లోన్ తీర్చిన తర్వాత పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పాడు. కుటుంబాన్ని నడిపించడానికి తండ్రికి ఒకవైపు చేదోడువాదోడుగా ఉంటూనే మరోవైపు డెకరేషన్ ఫీల్డ్‌లో పనిచేస్తూ అందరితో డైమండ్ అని పిలిపించుకునే కృష్ణాయాదవ్ అకాల మరణం ఆ కుటుంబానికి తీరని లోటు మిగిల్చింది. చెట్టంత కొడుకు చేతికంది వచ్చాడని సంబరపడే ఆ తల్లిదండ్రులు, నాయనమ్మలు ఇప్పుడంతా శూన్యమే అంటున్నారు.
అందరినీ చూసుకుంటూ వారితో ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసే ఈ 24 ఏళ్ల యువకుడిని కరెంట్ కబళించింది. తన చెల్లి పెళ్లి చేసిన సంబరం ముగియకముందే, కులదైవం కృష్ణుడి శోభాయాత్రలో తమ హంగామా చూపించి చివరి నిముషం వరకు అందరినీ ఆడించి పాడించిన డైమండ్ చివరికి కానరాని లోకాలకు వెళ్లిపోయాడని కుటుంబసభ్యులు, బంధు మిత్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతి అందరినీ కంటతడిపెట్టించింది. గోడవతల నేనున్న.. గోడకు ఇవతలవైపు కరెంట్ షాక్ కొట్టిందంటూ కేకలు విని వచ్చేసరికే ప్రాణం పోయిందంటూ ఆ తండ్రి కంటతడిపెట్టుకున్నారు.
ఆ ముగ్గురు చుట్టంచూపుగా వచ్చారు..
శ్రీకాంత్‌రెడ్డి,వికాస్, రాజేందర్‌రెడ్డి ఈ ముగ్గురూ శోభాయాత్ర ఆర్గనైజర్ రవీందర్యాదవ్కు స్నేహితులు. గత మూడేళ్ల నుంచి ప్రతీ సంవత్సరం శోభాయాత్రకు వచ్చి భోజనం చేసి వెళ్లిపోయేవారు. కానీ ఈ సంవత్సరం చివరి వరకు ఉండడమే వాళ్ల ప్రాణాలకు ముప్పు తెచ్చింది. ముగ్గురూ కలిసి వచ్చి శోభాయాత్రలో పాల్గొని వెళ్లేవారని, తమతో పాటు కలిసిపోయేవారని ఇలా అయితుందని అనుకోలేదని స్థానికులు చెప్పారు. శ్రీకాంత్‌రెడ్డికి ఒక కొడుకు, బిడ్డ ఉన్నారు.
తల్లిదండ్రులు వృద్ధులు. ఇద్దరు అన్నలు విదేశాల్లో ఉంటారు. వారు ఇటీవలే వచ్చి వెళ్లారు. ఒకరేమో ఇంకా తమ ప్రాంతానికి వెళ్లకముందే ఈ వార్త అందిందని స్థానికులు చెప్పారు. ఇక్కడ తను ఒక్కడే ఉండడంతో తల్లిదండ్రుల ఆలనాపాలనా కూడా ఇతనే చూసుకునేది. అనారోగ్యంతో ఉన్న మాకు ఈ పరిస్థితేంటంటూ ఆ తండ్రి పడుతున్న బాధ వర్ణనాతీతం.
టాటా ఏస్‌కు కడితే బతికేవారు..!
రథయాత్రకు సంబంధించి రథాన్ని లాగుతున్న జీప్ చెడిపోయింది. దీంతో పక్కనే నిలిపివేసిన యువకులు రథాన్ని నెట్టే క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. మరోవందమీటర్లు వెళితే రథాన్ని లోపలికి పెట్టేయొచ్చంటూ వాళ్లు రథాన్ని లాగారు. టాటా ఏస్ వచ్చిన తర్వాత రథాన్ని దానికి కట్టి తీసుకెళ్దామంటే కూడా ఇక్కడికే కదా.. తాము ఇంతమందిమి ఉన్నాం లాగుతాం అంటూ ఉత్సాహంగా రథం లాగారు. దీంతో టాటాఏస్ వెళ్లిపోయింది. ఒకవేళ రథాన్ని టాటాఏస్కు కట్టి తీసుకెళ్తే అందరూ బతికేవారేమో అని స్థానికులు చెప్పారు. సెకన్లలో జరిగిపోయిందని, రాడ్స్ పట్టుకున్నవారందరూ షాక్ కొట్టి ఎగిరిపడ్డారని, మిగతావారు సేఫ్‌గా ఉన్నారని వారు చెప్పారు.
కృష్ణాష్టమి వేడుకల్లో అపశ్రుతి
విద్యుదాఘాతంతో మృతిచెందింది వీరే..
ఓల్డ్ రామంతాపూర్‌కు చెందిన కృష్టా అలియాస్ డైమాండ్ యాదవ్(21), సురేశ్‌యాదవ్(34), హబ్సిగూడకు చెందిన రుద్రవికాస్(39), రామంతాపూర్ శారదనగర్‌కు చెందిన శ్రీకాంత్‌రెడ్డి (35), హబ్సిగూడ రవీంద్రనాథ్ కాలనీకి చెందిన
రాజేంద్రరెడ్డి(48) .