Borabanda | ఎర్రగడ్డ, మార్చి 3 : బోరబండ పోలీస్ స్టేషన్.. పశ్చిమ మండలం, ఎస్ఆర్ నగర్ డివిజన్లో 2023 జూన్ 2వ తేదీన ప్రారంభమైంది. అంటే ఈ పోలీస్ స్టేషన్ ఏర్పడి రెండేళ్లు కూడా పూర్తి కాలేదు. కానీ ఇప్పటివరకు ఐదుగురు ఇన్స్పెక్టర్లు మారారు.
ఈ పోలీస్ స్టేషన్లో తొలి ఇన్స్పెక్టర్గా కామల్ల రవికుమార్ బాధ్యతలు చేపట్టారు. నాలుగున్నర నెలలకు ఇక్కడి నుంచి బదిలీ అయ్యారు. రవికుమార్ స్థానంలో వచ్చిన సుంకర విజయ్ కేవలం మూడు నెలలు మాత్రమే విధులు నిర్వహించారు. ఆ వెంటనే బదిలీ చేశారు. ఆయన స్థానంలో వచ్చిన కె.ఆదిరెడ్డి కూడా ఒక నెల రోజులు మాత్రమే బోరబండ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. బదిలీ వేటు పడటంతో వెళ్లిపోయారు. గతేడాది మార్చి నెలలో ఈ పోలీస్ స్టేషన్కు నాలుగో ఇన్స్పెక్టర్గా సుంకరి వీరశేఖర్ బాధ్యతలు తీసుకున్నారు. తాజాగా వీరశేఖర్ను బదిలీ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. వీరశేఖర్ స్థానంలో మల్కాపురం సురేందర్ బోరబండ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటి వరకు జరిగిన బదిలీల వెనుక వివాదాస్పద అంశాలు ప్రధాన కారణమని సమాచారం.