Hyderabad | హైదరాబాద్ : ఓ వ్యక్తి క్రూర మృగంలా ప్రవర్తించాడు. మనషుల పట్ల విశ్వాసంగా ఉండే కుక్క పిల్లలను అతి కిరాతకంగా చంపేశాడు. ఆరు రోజుల వయసున్న అభం శుభం తెలియని ఓ ఐదు కుక్క పిల్లలను నేలకేసి కొట్టి రాక్షస ఆనందం పొందాడు. కుక్క పిల్లలు చనిపోవడాన్ని గమనించిన స్థానికులు.. ఆ అపార్ట్మెంట్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా ఈ విషయం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ ఫతేనగర్‌లో ఓ వీధి కుక్క ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఇక ఎండలు మండిపోతుండడంతో.. అక్కడే ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీ సెల్లార్లో ఆ కుక్క పిల్లలు సేద తీరుతున్నాయి. ఎవరికీ ఎలాంటి హానీ కలిగించకుండా సేద తీరుతున్న ఆ కుక్క పిల్లలను, అదే అపార్ట్మెంట్లో ఉంటున్న ఓ వ్యక్తి అతి కిరాతకంగా చంపేశాడు. ఓ కుక్క పిల్లలను నేలకేసి కొట్టాడు. మరో దాన్ని గోడకేసి కొట్టాడు. ఇంకో దాని గొంతుపై కాలితో నులిమి చంపేశాడు. అలా ఐదు కుక్క పిల్లలను అత్యంత క్రూరంగా చంపేశాడు.
కుక్క పిల్లలు చనిపోయి ఉండడంతో అపార్ట్మెంట్ వాసులకు అనుమానం వచ్చింది. ఈ క్రమంలో అక్కడున్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా, అదే అపార్ట్మెంట్లో ఉన్న వ్యాపారి ఆశిష్ ఈ దారుణానికి పాల్పడినట్లు తేలింది. దీంతో ఆశిష్‌ను అపార్ట్మెంట్ వాసులు, జంతు ప్రేమికులు ప్రశ్నించగా.. ఆ కుక్క పిల్లలు తన పెంపుడు కుక్క దగ్గరకు వచ్చాయని.. అందుకే చంపేశానని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. ఈ ఘటనపై అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
జంతు సంక్షేమ కార్యకర్త ముదావత్ ప్రీతి మాట్లాడుతూ.. వీధుల్లో ఇలాంటి క్రూరమైన చర్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టడానికి కఠినమైన శిక్షలు విధించాలని ఆమె డిమాండ్ చేశారు. నిజానికి.. మూగజీవుల పట్ల ఇంతటి దారుణంగా ప్రవర్తించే వారికి కఠినమైన శిక్షలు వేయకపోతే.. ఇలాంటి అకృత్యాలు పునరావృతమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఒక నిండు ప్రాణాన్ని తీసే హక్కు ఎవరికీ లేదు.. ఇక అభం శుభం తెలియని పసి ప్రాణుల పట్ల ఇంతటి క్రూరత్వం చూపడం క్షమించరాని నేరం.
Sensitive Content
హైదరాబాద్ – ఫతేనగర్ హోమ్ వ్యాలీలో అప్పుడే పుట్టిన 5 కుక్క పిల్లలు చంపిన దుర్మార్గుడు
అపార్ట్మెంట్ సెల్లార్లో తన పెంపుడు కుక్క దగ్గరకు వీధి కుక్క వచ్చిందని దాని 5 పిల్లలను చంపిన మూర్కుడు pic.twitter.com/psfJsURZYE
— Telugu Scribe (@TeluguScribe) April 17, 2025