సైదాబాద్, జూలై 19 : హైదరాబాద్ మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో పట్ట పగలు గన్‌తో సీపీఐ నాయకుడు కేతావత్ చందు నాయక్‌ను కాల్చి చంపిన కేసును పోలీసులు చేధించారు. హయత్‌నగర్ మండలం కుంట్లూర్ వద్ద వేసిన 1300 గుడిసెవాసుల వద్ద, బిల్డర్ల వద్ద వసూలు చేసిన నగదు పంపకాల్లో వచ్చిన విభేదాలే హత్యకు దారితీశాయని పోలీసుల విచారణలో తేలింది. ఆర్థిక, వివాహేతర సంబంధాల కారణంగానే రాజన్న, అతని అనుచరులు కలిసి చందు నాయక్‌ను హత్య చేసినట్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో హత్య కేసులో ప్రమేయం ఉన్న ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను శనివారం సాయంత్రం సైదాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సౌత్ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్యకుమార్ వెల్లడించారు.
చైతన్యపురిలో నివసించే కేతావత్ చందు నాయక్ (48) సీపీఐ స్టేట్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేస్తున్నారు. ఈ నెల 15వ తేదీన మలక్‌పేట మూసారాంబాగ్ డివిజన్ పరిధిలోని శాలివాహన నగర్ పార్క్ వద్ద వాకింగ్ చేసి బయటకు వస్తున్న ఆతనిపై దొంతి రాజేశ్ (48) అలియాస్ రాజన్న తన అనుచరులతో కలిసి పిస్టల్, రివాల్వర్‌తో కాల్పులు జరిపి హత్య చేశారు. తొమ్మిది మంది కలిసి ఒక ముఠాగా ఏర్పడి చందు నాయక్‌ను దారుణంగా హత్య చేశారు. హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజన్న స్వగ్రామం జనగామ జిల్లా కడివెండి సీతారామపురం గ్రామం. సీపీఐ(ఎంఎల్) పార్టీలో పనిచేసిన అతను ఉప్పల్ సమీపంలోని భగాయత్‌లో నివసిస్తున్నారు. రాజన్నపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయని.. అతనికి మావోయిస్టులతో కూడా సంబంధాలు ఉన్నాయని డీసీపీ చైతన్య కుమార్ తెలిపారు. ఈ హత్యతో ప్రమేయం ఉన్న వరంగల్ జిల్లాకు చెందిన కుంభఏరుకుల ఏడుకొండలు, యాదాద్రి భువనగిరి జిల్లా కందుకూరుకు చెందిన ప్రశాంత్, ఏపీకి చెందిన అర్జున్ జ్ఞానప్రకాశ్, లింగబేడి రాంబాబు, సీపీఐ(ఎంఎల్) మాజీ కమాండర్ శ్రీను అలియాస్ నాగరాజులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
ఆర్ధిక, వివాహేతర సంబంధాలే….. చందు హత్యకు దారి…
దొంతి రాజేశ్ అలియాస్ రాజన్న సీపీఐ (ఎంఎల్) పార్టీలో కొన్ని సంవత్సరాలు పాటు పనిచేశాడు. ఆ తర్వాత సీపీఐ పార్టీలో చేరాడు. అక్కడ చందునాయక్‌తో కలిసి పనిచేశాడు. ఈ క్రమంలో హయత్‌నగర్ మండలం కుంట్లూరులో దాదాపుగా 13 వందల గుడిసెలు వేయించి, ప్రతి గుడిసెవాసి నుంచి వెయ్యి రూపాయల చొప్పున 13 లక్షల రూపాయలను, దీంతోపాటు స్థానికంగా నివసించే బాల్‌రెడ్డి అనే ఒక బిల్లర్ వద్ద 12 లక్షల రూపాయలను ఇద్దరు కలిసి వసూళ్లు చేశారు. అయితే ఆ డబ్బుల పంపకం విషయంలో ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. దీంతో ఒకరిపై మరొకరి ద్వేషం పెరిగింది. అలాగే తన భార్యతో చందు నాయక్‌కు అక్రమ సంబంధం ఉందని రాజన్నకు అనుమానం ఉండేది. ఈ క్రమంలోనే 2022 సంవత్సరంలో చందు నాయక్‌ను హత్య చేసేందుకు పథకం పన్నాడు. హత్య చేసేందుకు ఏడుకొండలు, ప్రశాంత్‌లను సాయం కోరాడు. పథకం ప్రకారం ముందుగా రెక్కీ నిర్వహించి చందు నాయక్ కదలికలను గమనించారు. ఈ నెల 15వ తేదీన మూసారాంబాగ్ శాలివాహన నగర్ పార్క్ వద్ద ఒంటరిగా వాకింగ్ చేస్తున్న చందు నాయక్ కంట్లో కారం జల్లి, తమతోపాటు తెచ్చుకొన్న పిస్టల్, రివాల్వర్‌తో కాల్పులు జరిపి అక్కడి నుంచి కారులో పరారయ్యారు.
చందు నాయక్ హత్యను చేధించడానికి 5 ప్రత్యేక బృందాలను, 5 స్పెషల్ టీంలను నియమించి రాజన్నను జనగామ వద్ద అదుపులోకి తీసుకొన్నామని, మరి కొందరిని నెల్లూరు జిల్లా కావలి వద్ద అదుపులోకి తీసుకొన్నామని డీసీపీ తెలిపారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన పిస్టల్, రివాల్వర్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అర్జున్ జ్ఞానప్రకాశ్, లింగిబేడి రాంబాబు కాకినాడలో చేసిన దొంగతనం కేసులో బంగారు అభరణాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందితుల అరెస్టులో విశేషంగా కృషిచేసిన సిబ్బందికి నగదు రివార్డ్సు అందజేసి అభినందించారు.