బన్సీలాల్ పేట్, ఏప్రిల్ 21 : అమర్నాథ్ యాత్రికులకు గాంధీ దవాఖానలో మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ సోమవారం మొదలైంది. ప్రధాన భవనం మొదటి అంతస్తులోని మెడికల్ రికార్డ్స్ విభాగంలో సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి పర్యవేక్షణలో ప్రభుత్వం నియమించిన నలుగురు వైద్య బృందం దరఖాస్తుదారుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.
రక్త పరీక్షలు, ఎక్స్ రే రిపోర్ట్ లను పరిశీలించారు. సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నవారికి ఫిట్నెస్ సర్టిఫికెట్లను జారీ చేశారు. సోమవారం సర్టిఫికెట్ల కోసం వచ్చిన ప్రజలతో ఎంఆర్డి సెక్షన్ కిక్కిరిసిపోయింది. ఇది పూర్తిగా ఉచితమని, ప్రతి సోమ, బుధ, శుక్రవారాలలో సర్టిఫికెట్ల జారీ చేయబడుతుందని అధికారులు తెలిపారు.