మేడ్చల్, ఆగస్టు 17: రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన భవనాలు లక్ష్యానికి దూరంగా ఉన్నాయి. ఐదేళ్ల కిందట పనులు ప్రారంభించి, మూడేళ్ల కిందట పూర్తిచేసిన భవనాలను వినియోగంలోకి తీసుకురావడంతో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. పరిస్థితి ఇంకొన్నాళ్లు ఇలాగే కొనసాగితే ఆయా భవనాలు శిథిలమై, ప్రజాధనం బూడిదిలో పోసిన పన్నీరయ్యే అవకాశం ఉంది. వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ పట్టణం 44వ జాతీయ రహదారికి ఆనుకొని హైదరాబాద్-మేడ్చల్ దారిలో మత్స్యశాఖకు ఐదెకరాల స్థలం ఉంది. ఈ స్థలంలో గతంలో అలంకరణ, ఆహార చేపల కేంద్రాన్ని నిర్వహించేవారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుల వృత్తులకు పెద్దపీట వేయడంతో చేపల కేంద్రాన్ని మత్స్య కళాశాలగా మార్చాలని సంకల్పించింది. ఈ మేరకు నిధులు కూడా విడుదల చేసింది. రూ.5.55 కోట్లతో టెండరు దక్కించుకున్న కాంట్రాక్టర్ మూడేళ్ల కిందటే మత్స్య కళాశాలకు భవనాలను నిర్మించి, శాఖకు అప్పగించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ మేడ్చల్లోని మత్స్య కళాశాల భవనం, ఆక్వా కోర్సులను ప్రారంభించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి అక్వారంగ కోర్సులకు మెరుగైన ఉపాధి..
దేశంలో అక్వా కల్చర్ రోజురోజుకు విస్తరిస్తోంది. చేపల, రొయ్యల ఉత్పత్తి రంగంలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన గత ప్రభుత్వం మేడ్చల్లో మత్స్య కళాశాల భవనం నిర్మించింది. రాష్ట్రంలో ఇలాంటి కళాశాలలు, శిక్షణా కేంద్రాలు అతి తక్కువగా ఉన్నాయి. చేపల రంగానికి సంబంధించి డిప్లమా, డిగ్రీ, పీజీ కోర్సును పూర్తిచేస్తే అక్వా రంగంలో మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మేడ్చల్లో మత్స్య శాఖ కళాశాల అందుబాటులోకి వస్తే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు పరిసర జిల్లాల విద్యార్థులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.
కుంటల పూడ్చివేతకు నిధుల కేటాయింపు..
మత్స్య కళాశాల నిర్వహణకు భవనాలు నిర్మించిన చోట ఐదెకరాల స్థలం ఉన్నప్పటికీ వరద నీరు భారీగా నిల్వ ఉంటుంది. జాతీయ రహదారి విస్తరణలో డ్రైన్ నిర్మించని కారణంగా ఇక్కడ వరద నీళ్లు నిల్వ ఉంటున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా కుంటలా కన్పిస్తుంది. కుంట పూడ్చివేత, లోపల రోడ్ల నిర్మాణానికి రూ.2.85 కోట్లు కేటాయించారు. పనుల నిర్వహణ ఇంకా టెండర్ వరకు కూడా వెళ్లనట్టు తెలిసింది. ఇటీవల మత్స్యశాఖ డైరెక్టర్ నిఖిల, టీజీఎఫ్సీవోఫ్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ మేడ్చల్ మత్స్య శాఖ కళాశాల భవనాలను జిల్లా మత్స్య శాఖ అధికారులతో కలిసి సందర్శించారు. కళాశాల విషయమై చర్చించినట్టు సమాచారం.
కబ్జాకు గురవుతున్న స్థలం..
పరిస్థితి ఇలాగే కొనసాగితే భవనాలు శిథిలావస్థకు చేరుకుంటాయి. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం కొద్ది కొద్దిగా కబ్జాకు గురయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పటికే కొంత భూమి కబ్జాకు గురైనట్టు స్థానికంగా టాక్. ప్రభుత్వం, అధికారులు స్పందించి వెంటనే మత్స్య కళాశాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.