సుల్తాన్ బజార్, జూన్ 8: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బత్తిని కుటుంబం నిర్వహించే చేపమందు ప్రసాదం పంపిణీకి ఆదివారం ప్రజలు పోటెత్తారు. అయితే ప్రభుత్వ యంత్రాంగం చేపమందు ప్రసాదం కోసం విచ్చేసే ప్రజలకు అరకొర ఏర్పాట్లు చేపట్టడంతో ఇబ్బందులు తప్పలేదు. మత్స్యశాఖ అధికారులు 35 కౌంటర్లను ఏర్పాటుచేసి చేపమందు ప్రసాదం పంపిణీ చేపట్టారు. కాగా ఈ ప్రసాదం పంపిణీలో క్యూలైన్లలో నిలిచి ఉన్న 75 ఏండ్ల వృద్ధుడు గుండె పోటుతో పడిపోగా అక్కడే ఉన్న వైద్య శిబిరానికి తరలించి అత్యవసర వైద్య చికిత్స, సీపీఆర్ అందించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే అతడు మృతి చెందాడు. మరోవైపు పలు స్వచ్ఛంద సంస్థలు ప్రసాదం పంపిణీ కోసం విచ్చేసిన ప్రజలకు ఆహారం అందించి మానవత్వాన్ని చాటుకున్నాయి. రాత్రి 7 గంటల వరకు 47వేల చేప పిల్లల ప్రసాదం పంపిణీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఆస్తమా తగ్గుతుందని నమ్మకం..
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేపమందు ప్రసాద పంపిణీని మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, సీనియర్ నాయకులు మధు యాష్కీ, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, బత్తిని కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి పొన్నం చాప ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మృగశిర కార్తి రోజు చేప ప్రసాదం తినడం వల్ల ఆస్తమా వ్యాధి తగ్గుతుందని చాలామంది నమ్మకమని అన్నారు. 48 గంటలు నిరంతరాయంగా బత్తిని కుటుంబ సభ్యులతో పాటు అన్ని శాఖలు పనిచేస్తున్నాయని అన్నారు.
బత్తిన సోదరులు నా సతీమణి బంధువులు..
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. చేపమందు ప్రసాదం కోసం గతంలో తన సతీమణి కుటుంబం ఢిల్లీ నుంచి వచ్చి చేపమందు తీసుకున్నారని గుర్తుచేశారు. బత్తిని కుటుంబం తన సతీమణి బంధువులు అని అన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ బండారు దత్తాత్రేయ, కర్ణాటక ఎమ్మెల్సీ మంజునాథ్, కార్పొరేటర్ రాఖీ జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు. మత్స్య శాఖ డిప్యూటీ డైరెక్టర్లు సుజాత, శ్రీనివాసు మాట్లాడుతూ.. ఒక్కో చేప ధర 40 రూపాయలుగా టోకెన్లు ఇవ్వడం జరిగిందన్నారు.
గతేడాది 60 వేల చేప పిల్లలను విక్రయాలు చెపట్టామని.. ఈ ఏడాది అంతే సంఖ్యలో ఇంచుమించు విక్రయాలు జరగవచ్చని వారు తెలిపారు.కాగా ఎగ్జిబిషన్ మైదానంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిటీ జాయింట్ పోలీస్ కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్, సెంట్రల్ జాన్ డీసీపీ శిల్పవల్లి, అదనపు డీసీపీ ఆనంద్, అబిడ్స్ ఎసీపీ ప్రవీణ్ కుమార్, ఇన్సెక్టర్లు భరత్ కుమార్, ఏడుకొండలు బందోబస్తును పర్యవేక్షించారు.