Hyderabad | హైదరాబాద్ : జంట నగరాలతో పాటు ఉత్తర తెలంగాణలోని అయిదు జిల్లాల ప్రజలు, వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. జాతీయ రహదారి (ఎన్‌హెచ్)-44పై దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న వాహనదారుల కష్టాలకు చరమగీతం పాడేందుకు రూ.1,580 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 5.320 కిలోమీటర్ల మేర కారిడార్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండ్లకోయ జంక్షన్ సమీపంలో శనివారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఎలివేటెడ్ కారిడార్‌పై తర్వాత మెట్రో మార్గం నిర్మించనున్నారు. ఈ రకంగా నగరంలో తొలి డబుల్ డెక్కర్ కారిడార్‌కు శనివారం నాంది ప్రస్థానం ప్రారంభం కానుంది.
ఎన్‌హెచ్-44పై సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి మొదలై తాడ్‌బండ్ జంక్షన్, బోయినపల్లి జంక్షన్ మీదుగా డెయిరీ ఫాం రోడ్డు వద్ద ముగుస్తుంది. ఈ మొత్తం కారిడార్ పొడవు 5.320 కిలోమీటర్లు. ఇందులో ఎలివేటెడ్ కారిడార్ 4.650 కిలోమీటర్లు ఉంటుంది. అండర్ గ్రౌండ్ టన్నెల్ 0.600 కి.మీ ఉంటుంది. మొత్తం 131 పియర్స్ (స్తంభాలు) ఉంటాయి. మొత్తం ఆరు వరుసల్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తారు. ఎలివేటెడ్ కారిడార్‌పైకి రాకపోకలు సాగించేందుకు వీలుగా బోయినపల్లి జంక్షన్ సమీపంలో ఇరువైపులా (0.248 కి.మీ. వద్ద), (0.475 కిలోమీటర్ వద్ద) రెండు చోట్ల ర్యాంపులు నిర్మిస్తారు… ఇది పూర్తయిన తర్వాత ఈ ఎలివేటెడ్ కారిడార్‌పై మెట్రో మార్గం నిర్మించనున్నారు. ఫలితంగా ఆ మార్గంలో ప్రయాణం మరింత క్షేమంగా, వేగంగా, సుఖవంతంగా సాగనుంది.
మొత్తం కారిడార్ పొడవు: 5.320 కి.మీ.
ఎలివేటెడ్ కారిడార్ పొడవు: 4.650 కి.మీ.
అండర్‌గ్రౌండ్ టన్నెల్: 0.600 కి.మీ.
పియర్స్: 131
అవసరమైన భూమి: 73.16 ఎకరాలు
రక్షణ శాఖ భూమి: 55.85 ఎకరాలు
ప్రైవేట్ ల్యాండ్: 8.41 ఎకరాలు
అండర్‌గ్రౌండ్ టన్నెల్‌కు: 8.90 ఎకరాలు
ప్రాజెక్టు వ్యయం: రూ.1,580 కోట్లు