మైలార్‌దేవ్‌పల్లి, మే 18: పాతబస్తీలోని గుల్జార్‌హౌస్ ఘటన జరిగిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే మైలార్‌దేవ్‌పల్లిలోని మొఘల్కాలనీలోని ఓ మూడంతస్తుల భవనంలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఏర్పడమే కాకుండా మంటల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడంతో పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం తప్పింది.
మైలార్ దేవ్ పల్లి డివిజన్ ఉడ్డెంగడ్డ, మొగల్స్ కాలనీ ప్రాంతంలో షేక్ మాజీద్‌కు చెందిన మూడంతస్తుల భవనంలో మరో ఏడు కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. ఆదివారం ఉదయం భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో విద్యుత్ మీటర్ల వద్ద షార్ట్ సర్యూట్ ఏర్పడింది. మంటలు గ్రౌండ్‌ఫ్లోర్‌లోని పాత ఫర్నిచర్, ఇతర వస్తువులకు వ్యాపించడంతో భవనంలోని మూడు అంతస్తుల వరకు దట్టమైన పొగ అలుముకుంది.
ఒక్కసారిగా మంటలు, పొగల దాటికి నిద్రలేచి, బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో భవనం టెర్రస్‌పైకి పరగులు తీసి, హాహాకారాలు చేశారు. చాంద్రాయణగుట్ట ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేసి.. చిక్కుకుపోయిన 16 మంది పిల్లలు, 34 మంది పెద్దలు, వృద్ధులను సురక్షితంగా బయటికి తీసుకువచ్చి ప్రాణాలు కాపాడారు.