సిటీబ్యూరో, జులై 1 (నమస్తే తెలంగాణ) : నిబంధనలు పాటించని కోచింగ్ సెంటర్లపై జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం తనిఖీలు నిర్వహిస్తున్నది. పద్మారావునగర్, అమీర్‌పేట, అశోక్‌నగర్ ఆర్టీసీ క్రాస్‌రోడ్, దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాలలో వారం రోజులుగా భద్రతా తనిఖీలు చేపట్టగా… ఫైర్ సెఫ్టీ నిబంధనలు పాటించని 80 కోచింగ్ సంస్థలను గుర్తించి వారికి నోటీసులు జారీ చేశారు. 15 రోజుల వ్యవధిలో ఫైర్ సెఫ్టీ నిబంధనలు పాటించాలని, లేని పక్షంలో సదరు సంస్థలను సీజ్ చేస్తామని ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు. ప్రతి కోచింగ్ సెంటర్ ఫైర్ సెఫ్టీ సర్టిఫికెట్ తీసుకోవాలని సూచించారు.