జూబ్లీహిల్స్: రహ్మత్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీలో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. ఆదివారం జరిగిన బూత్ కమిటీ సమావేశంలో స్థానిక కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, నగర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భవానీ శంకర్ వర్గీయులు బాహాబాహీకి దిగారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు పోటీయే లేదు అని బయటకు చెబుతున్న మంత్రులకు నేతల మధ్య విబేధాలు మింగుడుపడడంలేదు. కొంతకాలంగా చాపకిందనీరులా ఉన్న రెండు వర్గాల మధ్య విబేధాలు సమయం వచ్చినప్పుడు బయటపడుతున్నాయి.
ఇటీవల కార్పొరేటర్ జీహెచ్ఎంసీ అధికారిపై జులుం చూపించినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వలస నేతలతో కాంగ్రెస్ పార్టీకి చెడ్డపేరు వస్తుందని సిటీ జనరల్ సెక్రటరీ భవానీ శంకర్ బాహాటంగా విమర్శించారు. బాధిత అధికారిని పరామర్శించి సంఘీభావం తెలిపారు. ఈ ఘటనతో మంత్రులను తరచూ డివిజన్లో కార్యక్రమాలకు పిలిపించుకునే చరిష్మా ఉన్న కార్పొరేటర్‌కు సొంత పా ర్టీ నుంచే మద్దతు లేదన్నది బహిర్గతమైంది.
ఇటీవల స్థానిక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశానికి పిలువలేదన్న అక్కసుతో ఆదివారం జరిగిన బూత్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి వచ్చిన కార్పొరేటర్‌ను, అతని వర్గీయులను భవానీ శంకర్ వర్గీయులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల వాగ్వాదం, తోపులాటలతో సభ రసాభాసగా మారింది. పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. బూత్ కమిటీ సమావేశం నిర్వహించేందుకు కార్పొరేటర్ ఫంక్షన్ హాల్ తాళాలు ఇవ్వకపోవడంతో తాళాలు పగులగొట్టి సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. కాగా, మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలోనే కార్యకర్తల పరస్పర దూషణలు, ఘర్షణకు కారణమైన ఈ ఇరువురు నేతలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల టికెట్ రేసులో ఉండడం గమనార్హం.