కార్వాన్, జూలై 24: జియాగూడ వెంకటేశ్వరనగర్ కాలనీలోని ఓ ఫర్నీచర్ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ కుటుంబంలోని తండ్రితో పాటు కూతురు మరణించింది. తల్లి, చిన్న కూతురు ఉస్మానియా దవాఖానలో విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నారు. జియాగూడ డివిజన్లోని వెంకటేశ్వరనగర్ నివాసి ధనుంజయ్ అగర్వాల్ కొన్నేళ్లుగా ఐదు అంతస్తుల సొంత భవనంలో ఫర్నీచర్ తయారీ, గోదాం నిర్వహిస్తున్నాడు. గ్రౌండ్ ఫ్లోర్లో ఫర్నీచర్ తయారీతో పాటు మొదటి అంతస్తులో ఫర్నీచర్‌కు ఉపయోగపడే సామగ్రిని నిల్వ ఉంచాడు. మరో రెండు అంతస్తుల్లో ఫర్నీచర్ తయారు చేసే కార్మికుల కుటుంబాలు ఉన్నాయి.
శ్రీనివాస్(42) ఫర్నీచర్ కార్మికుడి. అక్కడే భార్య నాగరాణి(36)తో పాటు పెద్ద కూతురు శివప్రియ(10) చిన్న కూతురు హరిణితో కలిసి ఉంటున్నాడు. రెండు, మూడో అంతస్తుల్లో మరో రెండు కుటుంబాలున్నాయి. ఇదిలా ఉండగా.. మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన మొదటి అంతస్తులో ఉంటున్న శ్రీనివాస్ కుటుంబం బయటకు వెళ్లేందుకు ప్రయత్నించాడు.
ఒకే మార్గం ఉండటం, గ్రౌండ్ ఫ్లోర్‌లోనే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో బయటకు వచ్చే ప్రయత్నంలో మొత్తం కుటుంబం మంటల్లో చిక్కుకొని తీవ్ర గాయాలపాలైంది. గమనించిన స్థానికులు పోలీసులకు, ఫైర్ స్టేషన్‌కు సమాచారమిచ్చి, మంటలార్పే ప్రయత్నం చేశారు. గోదాంలో ఫర్నీచర్‌తో పాటు ఫర్నీచర్ తయారీకి ఉపయోగించే సొల్యూషన్, రెక్సిన్, ఎండు గడ్డి ఉండటంతో భారీ ఎత్తున మంటలు ఎగిశాయి. ఘటనా స్థలానికి వచ్చిన ఏడు ఫైరింజన్లు మంటలార్పడంతోపాటు పై అంతస్తులో చిక్కుకున్న ఎనిమిది మందిని కాపాడి.. చికిత్స నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు.
తీవ్రగాయాలకు గురైన శివ ప్రియ(10) ఉస్మానియా దవాఖానకు చేరుకున్న కొద్ది సేపటికే మృతి చెందగా.. శ్రీనివాస్ (42) చికిత్స పొందుతూ ఉదయం మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నాగరాణి పరిస్థితి విషమంగా ఉండగా.. ఎనిమిదేండ్ల హరిణి స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మిగతా నలుగురు మాధవి, లక్ష్మీ బాయి, మేఘనతో పాటు మరొకరికి స్వల్ప గాయాలు కావడంతో చికిత్స అందించి, ఇంటికి పంపించారు. అగ్నిప్రమాద స్థలాన్ని సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్, ఏసీపీ మునావర్ అలీ, కుల్సుంపుర ఎస్హెచ్ఓ రామస్వామి, హైదరాబాద్ జిల్లా ఆర్డీఓ, ఆసిఫ్‌నగర్ తహసీల్దార్ సందర్శించారు. ప్రమాద స్థలంలో పంచనామా నిర్వహించారు. బాధితులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ అగ్ని ప్రమాదంలో శ్రీనివాస్‌తో పాటు అతడి పెద్ద కూతురు శివ ప్రియ మృతి చెందగా.. అతడి భార్య నాగరాణి విషమ పరిస్థితిలో ఉన్నది. చిన్న కూతురు హరిణి స్వల్ప గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీనివాస్ నాలుగేండ్లుగా ఇదే ఫర్నీచర్ గోదాంలో పనిచేస్తూ కుటుంబంతో కలిసి అక్కడే ఉంటున్నాడు. వివరాలను వెల్లడిస్తూ శ్రీనివాస్ సోదరుడు విష్ణు కంటతడి పెట్టాడు. తాను లాలాపేటలో ఉంటానని, ప్రమాదం జరిగిన వెంటనే శ్రీనివాస్ ఫోన్‌చేయడంతో వచ్చినట్టు విష్ణు చెప్పాడు.
యజమాని ధనుంజయ్ అగర్వాల్ ఎక్కడ కూడా భద్రతా ప్రమాణాలు పాటించలేదని స్థానికులు తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్లో ప్రమాదం సంభవించడం.. ఆ భవనానికి ఒకే మార్గం ఉండటంతో బాధితులు బయటపడే క్రమంలో గాయపడి ప్రాణాలు పోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భవనం పక్కన కొంత ఖాళీ స్థలం ఉండటంతో అక్కడి నుంచే మిగతా వారిని రక్షించారని స్థానికులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన భవనం పక్కనే ఉన్న మరో భవనానికి కూడా మంటలు వ్యాపించాయి.
ఈ ప్రమాదంలో నాలుగు ద్విచక్ర వాహనాలు కాలిపోయాయి. ఇదిలా ఉండగా.. గోదాంలో అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న యజమానికి గుండెపోటు వచ్చిందని, అతడిని దవాఖానలో చేర్పించినట్లు స్థానికులు తెలిపారు. జియాగూడలో ఇది మూడో ప్రమాదం, ఇలా మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే పరిశ్రమలు, కార్ఖానాలను నివాసాల మధ్య నుంచి తొలగించాలని కార్పొరేటర్ బోయిని దర్శన్ అన్నారు. ప్రజల ప్రాణ నష్టానికి యజమానులతో పాటు సంబంధిత ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాలన్నారు.