ఖైరతాబాద్/బన్సీలాల్‌పేట్: భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజా వద్ద ఆదివారం నిర్వహించిన భారతమాత మహాహారతి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకున్నది. ప్రమాదవశాత్తు పటాకులు పేలి హుస్సేన్ సాగర్‌లో రెండు బోట్లు కాలిపోయాయి. రాత్రి 9గంటల ప్రాంతంలో వేడుకలు ముగిసే సమయంలో రెండు బోట్ల ద్వారా పటాకులు కాల్చేందుకు ఏర్పాట్లు చేయగా, అందులో భాగంగా జెట్టి, బోటును ఏర్పాటు చేశారు. అందులో భారీగా పటాకలను పెట్టారు. మహాహారతి ముగియగానే వెంటనే పటాకులను అంటించారు. స్కైషాట్ను కాల్చడంతో అది తిరిగి బోటులోనే పడిపోయింది. దీంతో ఒక్కసారిగా అందులో ఉన్న పటాకులు ఒక్కొక్కటికిగా పేలడం మొదలయ్యాయి.
చూస్తుండగానే పటాకులన్నీ పేలడంతో జెట్టితో పాటు దాని వెంట ఉన్న బోటులో మంటలు వ్యాపించి అగ్నికి ఆహుతయ్యింది. ఆ సమయంలో జెట్టిపై నలుగురు, బోటులో ఇద్దరు ఉన్నారు. ఈ ప్రమాదంలో బోటు డ్రైవర్ పల్లె ప్రణీత్ (32), దుబ్బాసి సునీల్ (38)కు చేతులు, కాళ్లకు మంటలు అంటుకున్నాయి. అదే బోటులో ఉన్న నలుగురు యువకులు నీటిలో దూకి ఒడ్డుకు చేరుకున్నారు. క్షతగాత్రులను గాంధీ దవాఖానకు తరలించగా, ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు. క్షతగ్రాతులకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఘటనపై సెక్రటేరియట్ (లేక్) పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భారతమాత మహాహారతి కార్యక్రమంలో అప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉండగా, అక్కడే భారీగా పోలీసు బందోబస్తు ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలకు ఉపక్రమించారు. నాలుగు ఫైరింజన్లను రప్పించి సుమారు మూడు గంటల సేపు శ్రమించి మంటలను అర్పివేశారు. వేడుకులకు భారీగా తరలివచ్చిన సందర్శకులు భయాందోళనకు గురై పరుగులు తీశారు.
మంటలు అంటుకున్న బోటు సుమారు రెండు గంటల పాటు నీటిలో తేలియాడుతూ ముందుకు కదిలింది. ఆ సమయంలో సాగర్‌లో ప్యాసింజర్ బోట్లు సైతం ఉన్నాయి. అక్కడి సిబ్బంది అప్రమత్తమై ప్రమాదాన్ని తప్పించారు.