శంషాబాద్ రూరల్, డిసెంబర్ 23 : శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న బ్యాటరీ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రాంగణంలోని అమర్ రాజా బ్యాటరీ కంపెనీ నిర్మాణం కొనసాగుతున్నది. ఇందులో భాగంగా.. సోమవారం సాయంత్రం 5.10 10 నిమిషాల సమయంలో నిర్మాణంలో ఉన్న 5వ అంతస్తులో వెల్డింగ్ పనులు చేస్తుండగా మంటలు కింద నాలుగో అంతస్తులో ఉన్న ఫ్లైఉడ్ షీట్‌కు అంటుకుని మంటలు చెలరేగాయి.
దీంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే వారు వచ్చి దాదాపు 2 గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. ప్రమాద సమయంలో కంపెనీలో 150 మంది కార్మికులు పని చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.