శంషాబాద్, జూలై 22: ప్రమాదవశాత్తు మంటలంటుకొని ఓ కారు పూర్తిగా దగ్ధం కాగా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం శంషాబాద్ పరిధిలోని అవుటర్ రింగ్‌రోడ్డుపై జరిగింది. శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసుల కథనం ప్రకారం.. కొత్తూరు మండలం తిమ్మాపూర్‌కు చెందిన శ్రీకాంత్ గురువారం కారులో శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వైపు అవుటర్ రింగ్ రోడ్డుపై వెళ్తున్నాడు. శంషాబాద్ పరిధిలోని ఎయిర్‌పోర్టు కాలనీ సమీపంలోకి రాగానే కారు ఇంజిన్‌లో మంటలు వచ్చాయి. కారులో వచ్చిన మంటల్లో డ్రైవర్ చిక్కుకుపోయాడు. అదే మార్గంలో వెళ్తున్న ఓ లారీ, ఆటో డ్రైవర్ అప్రమత్తమై పోలీసులకు, 108కు సమాచారం అందించారు. పోలీసులు, 108 అంబులెన్స్ చేరుకొని.. కారు మంటల్లో నుంచి శ్రీకాంత్‌ను బయటకు తీశారు. అప్పటికే అతడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.