సిటీబ్యూరో, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): మీరు ఏదైనా సమస్యపై ఫిర్యాదు చేశారా..ఆ ఫిర్యాదుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ కోసం ఠాణా చుట్టూ తిరుగుతున్నారా..ఇక నుంచి మీరు అలా పోలీసు స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ ఫిర్యాదుకి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ నేరుగా ఫిర్యాదుదారుల వాట్సాప్కే పంపించాలని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి వినూత్న నిర్ణయం తీసుకున్నారు. రెండు నెలల క్రితమే 60ఏళ్లు దాటిన వృద్ధులకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలను నేరుగా వారి ఇంటికి వెళ్లి అందించేలా చర్యలు తీసుకున్న సీపీ తాజాగా సాధారణ ప్రజానీకానికి సైతం వాట్సాప్ ద్వారా ఎఫ్ఐఆర్ కాపీని పంపించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
దీని వల్ల ఇక నుంచి ఫిర్యాదు దారులు ఎఫ్ఆర్ కాపీ కోసం స్టేషన్ల చుట్టూ తిరగడం, సంబంధిత అధికారులను వేడుకోవాల్సిన అవసరం లేదు. వృద్ధులకు ఇంటివద్దకే వెళ్లి ఎఫ్ఐఆర్ కాపీని అందచేసే కార్యక్రమం సత్ఫలితాలివ్వడంతో సాధారణ ప్రజానీకానికి సైతం ఎఫ్ఐఆర్ కాపీని అందుకోవడం మరింత సరళతరం చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ విధానం అమలు చేయాల్సిందిగా కమిషనరేట్ పరిధిలోని అన్ని ఠాణాల అధికారులకు ఆదేశాలు జారీచేశామని, త్వరలోనే ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తామన్నారు.