సిటీబ్యూరో, జూలై 28 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ పరిధిలో కూల్చివేసిన భవన నిర్మాణ వ్యర్థాలను, కూల్చి వేసిన వ్యర్థాలను సేకరించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ప్రత్యేక చర్యలు చేపట్టింది. నగర శివారులోని ఫతుల్లాగూడ, జీడిమెట్ల, శంషాబాద్, తూంకుంటలో ఒక్కొక్కటి 500 టన్నుల సామర్థ్యంతో సీ అండ్ డీ (కన్స్ట్రక్షన్స్ అండ్ డీమాలిషన్) ప్లాంట్లను ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉత్పత్తయ్యే వ్యర్థాలను ఎక్కడబడితే అక్కడ పారబోయకుండానే సర్కిళ్ల వారీగా నిర్ణయించిన ప్రాంతాల్లోనే ఆ వ్యర్థాలను సంబంధిత ఏజెన్సీలకు అందజేయాలని జీహెచ్ఎంసీ ఈవీ అండ్ డీఎం డైరెక్టర్ ఎన్.ప్రకాశ్ రెడ్డి తెలిపారు. ఏ రోజుకు ఆ రోజు వ్యర్థాల సేకరణ చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా నగరం నలువైపులా నాలుగు రీసైక్లింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేసి, వ్యర్థాలను శుద్ధి చేస్తున్నారు.
ఇందులో భాగంగానే ఒక్కొక్క సర్కిల్‌కు 2-6 టన్నుల కెపాసిటీతో రెండు చిన్న వాహనాలను, మరో 16-25 టన్ను కెపాసిటీతో పెద్ద వాహనాలను ఏర్పాటు చేశారు. వ్యర్థాల తరలింపునకు సర్కిళ్ల వారీగా టోల్ ఫ్రీ నంబరు, వాట్సాప్ నంబరు 91541 14998ను అందుబాటులోకి తీసుకువచ్చామని, మెట్రిక్ టన్నుకు సంబంధిత యూజర్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని, స్వయంగా ప్లాంట్ వద్దకు తరలిస్తే తక్కువ యూజర్ చార్జీలు ఉంటాయన్నారు. ఇవన్నీ ప్రస్తుతం అందుబాటులో ఉన్నా కొందరు ప్రైవేటు వ్యక్తులు వ్యర్థాలను రోడ్లపైనా, ఖాళీ స్థలాల్లోనూ రాత్రికి రాత్రే పారబోసి వెళ్తున్నారు. ఇలాంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకునేలా 2019లో జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం మొదటిసారి వ్యర్థాలను పారబోసిన వారికి రూ.25వేలు, రెండవ సారి పోస్తే రూ.50వేలు, మూడవసారి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తామని ప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛ హైదరాబాద్‌కు కృషి చేస్తున్న జీహెచ్ఎంసీకి ప్రజలు పూర్తిగా సహకరించాలని కోరారు.