అతడి పేరు నరేశ్. వనస్థలిపురం వాసి. అతడు రెండు సంస్థలకు ఎండీ. అతడు అవసరాల రిత్యా కొందరి నుంచి లక్షల రూపాయల అప్పు జేశాడు. తిరిగి సకాలంలో చెల్లించడంలో విఫలమయ్యాడు. దీంతో అప్పు ఇచ్చినవాళ్లు నరేశ్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. చివరికి ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
అతడి పేరు శ్రీధర్. పెళ్లై 2 ఏండ్లు అయింది. ఉద్యోగమూ ఉంది. జీతం నెలకు రూ.30వేలు. మొదటి ఏడాది భార్యను సొంతూళ్లనే ఉంచాడు. రెండో ఏడాది నగరానికి తీసుకొచ్చి ఇల్లు అద్దె తీసుకున్నాడు. కాగా నెల జీతం అతడి అదనపు అవసరాలకు సరిపడలేదు. ఎలాగూ నెలనెల జీతం వస్తుంది కదా అని కొన్ని యాప్‌లను ఆశ్రయించి అతడి అర్హతకు అనుగుణంగా లోన్ తీసుకున్నాడు. ఏ రోజుకా రోజు అవసరాలను దాటేసాడు. మళ్లీ ఏదైనా ఆర్థిక సమస్య రాగానే మరో యాప్‌ను ఆశ్రయించాడు.
ఇలా ఐదారు యాప్‌ల్లో రుణం తీసుకున్నాడు. ఇప్పటి వరకు బాగానే ఉన్నా ఇప్పుడు ఆ మొత్తంపై వడ్డీ చెల్లించడానికి జీతం మీదనే ఆధారపడాలి. ఇప్పుడు అతడు చేసిన నాలుగు లక్షల రుణానికి సుమారు 15 వేలపైనే వడ్డీ చెల్లించాల్సి వచ్చింది. ఉన్న జీతంలో సగం డబ్బులు రుణానికి పోగా, ఇంటి అద్దెకు, కరెంట్ బిల్లు, పాలబిల్లు, ఇతర ఖర్చులన్నీ ఇప్పుడు భారంగా మారాయి. ఏం చేయాలో అర్థం కాక దంపతుల్లో చిచ్చు మొదలైంది. యాప్ సంస్థలు అతడిని వేధించసాగాయి. దీంతో ఒత్తిడి భరించలేక సదరు వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మరణించాడు.
రంగారెడ్డి కలెక్టరేట్లో ఓ కానిస్టేబుల్.. ఆన్లైన్ గేమ్‌లు ఆడటం కోసం అప్పులు చేసిండు. తిరిగి అవి చెల్లించలేక ఆరు నెలల క్రితం ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలా నగరంలో చాలా మంది ఆర్థికపరమైన ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు.
Savings | సిటీబ్యూరో, మార్చి 7 ( నమస్తే తెలంగాణ ) : సామాన్యుల నుంచి వీఐపీల వరకు.. ఆర్థిక క్రమశిక్షణ లేని జీవితాలు కూలిపోయాయి. ఉన్నప్పుడు అవలంబించాల్సిన నియమాలు చేజారాక లబోదిబోమంటే ఏం లాభమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉన్నంతలో ఎవరికి వారే ఆర్థిక క్రమ శిక్షణ పాటించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ప్యాకేజీ ఎంతొచ్చినా పొదుపుపై అవగాహన లేకపోతే అంతేసంగతులు. అది లక్షల జీతమైనా.. అమెరికా కొలువైనా పొదుపు మంత్రం పాటించకపోతే జీవితాలు తారుమారవుతాయి. చాలా మంది ఆర్థిక క్రమశిక్షణ లేక జీవితాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. ఓ దశలో ప్రాణాలు కోల్పోవల్సిన ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతాయి. అందుకే పొదుపు సూత్రాన్ని పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక కష్టాల నుంచి బయటపడే మార్గం సుగమం చేసుకోవాలని సూచిస్తున్నారు.
వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా తమ ఆదాయ వ్యయాలు ఆర్థిక లావాదేవిల్నీ నిత్యం పర్యవేక్షించుకోవాలి. ఏఏ రంగాల్లో పెట్టుబడుల్ని పెట్టారు? ఎంత మొత్తంలో లబ్ధి చేకూరింది? ఆ పెట్టుబడుల్నీ మళ్లీ దేనిమీద పెట్టడానికి సిద్ధం అవుతున్నారు? నష్టాలోచ్చే రంగంపైపు చూడకుండా లాభాల వైపు స్థిరాస్తుల్ని పెంచుకునే విధంగా సమగ్రమైన ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఏవైనా అనుకోని ఆర్థికపరమైన సమస్యలు ఎదురైతే పరిష్కారం కోసం ప్రయత్నించాలి. ఆత్మహత్యల జోలికి వెళ్లకూడదు. దైర్యంగా నిలబడి ఎదుర్కోవాలి. చావు దేనికి పరిష్కారం కాదనే విషయం గుర్తుంచుకోవాలి.
-జీసీ కవిత, కౌన్సెలింగ్ సైకాలజిస్టు