సిటీబ్యూరో, డిసెంబరు 8(నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ 2025-26 ముసాయిదా బడ్జెట్ ఖరారు మరింత ఆలస్యం కానుంది. అక్టోబరులోనే బడ్జెట్ ప్రతిపాదనను ఆమోదం పొందాల్సి ఉన్నప్పటికీ నేటికీ ప్రతిపాదన కసరత్తు దశలోనే ఉంది. మొదటి వారంలో అన్ని శాఖల ముఖ్య అధికారుల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలు తీసుకుని సవరణ చేసిన బడ్జెట్‌ను స్టాండింగ్ కమిటీ ముందుకు తీసుకురావాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు.
రూ.8,340 కోట్లతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రతిపాదనలపై గత నెల 30వ తేదీన మేయర్ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆదాయ మార్గాలను తక్కువ చూపడంపై సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గడిచిన మూడేళ్లలో ఆదాయ రాబడిలో అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రకటన విభాగం, ఎస్టేట్ విభాగం, ఆస్తిపన్ను, టౌన్ ప్లానింగ్, ట్రేడ్ లైసెన్స్‌లలో లోపాలను ఎత్తిచూపి బడ్జెట్ సవరణలు చేసి తుది బడ్జెట్‌ను ఖరారు చేయాలని మేయర్ ఆదేశించారు.
ఇది గడిచి పది రోజులైనా బడ్జెట్ ఫైనల్ చేయలేదు. అధికారులు తలోదారి అన్నట్లుగా ఉండటం, ఫైనాన్స్ విభాగం అధికారుల నిర్లక్ష్యం వెరసి బడ్జెట్ ప్రతిపాదన మరింత ఆలస్యానికి కారణమైంది. ప్రజా విజయోత్సవాలలో కమిషనర్ బిజీగా ఉండటంతో సమీక్షించిన దాఖలాలు లేవు. అంతే కాకుండా దీనికి తోడు అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి మొదలు కావడంతో ఈ వారంలో జరగాల్సిన స్టాండింగ్ కమిటీ సమావేశం జరగడం అనుమానంగానే ఉంది. దీంతో మరో పది రోజుల పాటు బడ్జెట్‌పై సమయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి.
వాస్తవానికి అక్టోబరు నెలలోనే బడ్జెట్‌కి సంబంధించిన ప్రక్రియ మొదలు పెట్టాల్సి ఉన్నప్పటికీ.., డిసెంబర్ రెండో వారం వరకు సమయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ చట్టం -1955 ప్రకారం, కార్పొరేషన్ బడ్జెట్ అంచనాలను గత నెలలో బడ్జెట్ అంచనాలు, ప్రతిపాదనలపై కమిషనర్ నుంచి వివరణాత్మక సమాచారం స్టాండింగ్ కమిటీ ముందుకు రావాల్సి ఉంది. డిసెంబర్ 15వ తేదీలోపు వార్షిక బడ్జెట్ అంచనాలు స్టాండింగ్ కమిటీ ఆమోదించాలని చట్టం పేర్కొంటుంది.
వచ్చే ఏడాది జనవరి 10వ తేదీలోపు జనరల్ బాడి మీటింగ్‌లో సభ్యుల ముందు చర్చ పెట్టి ఆమోద ముద్ర పొందాల్సి ఉంటుంది. మార్పులు, చేర్పుల అనంతరం ఫిబ్రవరి 20లోపు అంచనాలను మంజూరు చేయాల్సి ఉంటుందని చట్టం చెబుతున్నది. మార్చి 1లోపు కార్పొరేషన్ బడ్జెట్ అంచనాల సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు విరుద్ధంగా కనబడుతున్నాయి. నిర్ణీత సమయంలో బడ్జెట్ ప్రక్రియను ముగిస్తారా? లేదంటే మార్పులు, చేర్పులతో ప్రభుత్వానికి సకాలంలో పంపించక కాలాయాపన చేస్తారా? అన్నది వేచి చూడాలి.