Hyderabad | బంజారాహిల్స్, ఏప్రిల్ 6 : ఫిలింనగర్ బస్తీల్లో ఎక్కడ చూసినా గంజాయి మత్తులో యువకులు మునిగిపోతున్నారు. దీన్ దయాళ్‌నగర్ బస్తీలోని ఆలయ పరిసరాల్లో పగలురాత్రీ అనే తేడా లేకుండా మందుబాబులు తిష్టవేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదంటూ స్థానిక మహిళలు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను చుట్టుముట్టి తమ గోడును వెల్లబోసుకున్నారు.
శ్రీరామనవమి సందర్భంగా ఫిలింనగర్‌లోని దీన్ దయాళ్నగర్కు వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను పెద్ద సంఖ్యలో మహిళలు చుట్టుముట్టారు. తమ బస్తీలో తాగుబోతుల బెడద ఎక్కువైందని, గుడిలోనే మద్యం తాగుతూ వచ్చీపోయేవారిని వేధిస్తున్నారంటూ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పెట్రోలింగ్ పోలీసులకు చెప్పినా పట్టించుకోవడం లేదని, మీకు ఓట్లు వేసి గెలిపించినందుకు మీరైనా పట్టించుకోండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఫిలింనగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులుకు కాల్ చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పోలీసుల పనితీరుపై జనం నిలదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో గంజాయి విచ్చలవిడిగా అమ్ముతుంటే మీరేం చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే సమస్యలను పరిష్కరించకపోతే తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.