హైదరాబాద్ : పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఫైల్స్ మాయమైనట్లు వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమని మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఓఎస్డీ (OSD) కళ్యాణ్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మాసాబ్ ట్యాంక్లో ఉన్న పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయాన్ని నూతన సచివాలయంలోని 2 వ అంతస్తులోకి తరలించి కార్యకలాపాలు నిర్వహించామని వివరించారు.
మంత్రి ఆమోదం కోసం వచ్చిన ఫైల్స్ ను నిర్దిష్టమైన విధానంలో ఎప్పటికప్పుడూ పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో అందజేశామని వెల్లడించారు. ప్రభుత్వ మార్పిడి ఫర్నిచర్, ఇతర సామగ్రిని జీఏడీకి అప్పగించే ప్రక్రియలో భాగంగానే మాసాబ్ ట్యాంక్ కార్యాలయానికి తాను, కార్యాలయ సిబ్బంది వెళ్లామని తెలిపారు.
శాఖాపరమైన ఫైల్స్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ కార్యాలయంలోనే ఉంటాయని స్పష్టం చేశారు. ఫైల్స్ మాయమైనట్లు వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారం, అవాస్తవమని స్పష్టం చేశారు.ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమని కళ్యాణ్ కుమార్ తెలిపారు.