శంషాబాద్ రూరల్, ఏపిల్ 19 ఆన్లైన్ గేమ్‌లో డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తులు మధ్య జరిగిన గొడవలో ఓ వ్యక్తి హత్యకు గురైన సంఘటన షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించింది. శంషాబాద్ ఇన్చార్జి డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. లింగారెడ్డిగూడ శివారులో ఎంఎస్ఎన్ కంపెనీ సమీపంలో ఈ నెల 12వ తేదీన ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది పడి ఉన్నట్లు బొద్ద అర్జున్ సమాచారం ఇవ్వడంతో షాద్‌నగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్యకు గురైన సదరు వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా బండి ఆత్మకూర్ మండలం చిన్నదేవులపురం గ్రామానికి చెందిన కిలరి సాయి రాహుల్(23)గా గుర్తించారు. ఆదే గ్రామానికి చెందిన శంకమురి వెంకటేశ్ ఇద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులు.. అయితే సాయిరాహుల్ లెవెన్ విన్నర్స్ క్యాషినో అనే ఆన్‌లైన్‌గేమ్ అలవాటు ఉంది. ఆ గేమ్‌ను అతడి స్నేహితుడు వెంకటేశ్‌కు చూపించి ఆడమని ప్రోత్సహించాడు.
దీంతో వెంకటేశ్ సైతం ఆ ఆటకు బానిసగా మారి ఆడుతూ దాదాపు రూ.15 లక్షలు పోగోట్టుకున్నాడు. గత వారం రోజుల క్రితం వెంకటేశ్ దగ్గర మూడు లక్షల రూపాయలు ఉన్నాయి. మరోసారి ఆన్లైన్ గేమ్ ఆడితే తాను గెలిచే విధంగా చేస్తాను డబ్బులు వస్తాయని ప్రోత్సహించాడు. దీంతో ఆన్‌లైన్‌గేమ్ ఆడగా ఉన్న మూడు లక్షలు గేమ్‌లో పోయాయి. దీంతో ఇద్దరు మధ్య డబ్బుల విషయమై గోడవ జరిగింది. దీంతో సాయి రాహుల్‌ను తనకు డబ్బులు ఇవ్వాలని వెంకటేశ్ పలుమార్లు అడిగాడు. తాను ఇవ్వనని ఎంచేస్తావో చేసుకో ఎక్కువ మాట్లాడితే అంతుచూస్తా… చంపేస్తా నంటూ బెదిరించాడు సాయిరాహుల్ అన్నంతపని చేస్తాడని గ్రహించి అతడినే చంపాలని నిర్ణయించి హైదరాబాద్ శివారులోని సూరారంలో ఉన్న నంద్యాలకు చెందిన తన స్నేహితుడికి, కుత్బుల్లాపూర్‌లో ఉన్న మరో వ్యక్తి సకారంతో సాయి రాహుల్ ను చంపేస్తే మీకు డబ్బులు ఇస్తానని ఆశచూపాడు. దీంతో ఇద్దరు కలిసి కారును అద్దెకు తీసుకొని ఈ నెల 12 తేదీన రాత్రి 10.30 గంటలకు షాద్‌నగర్ సమీపంలోని లింగారెడ్డిగూడ సమీపంలోని నిర్మూనుష ప్రదేశంలో వెంకటేశ్‌తో పాటు మరో ఐదుగురు కలిసి సాయిరాహుల్ను హత్య చేసి పారిపోయారు. ప్రధాన నిందితుడు వెంకటేశ్‌తో పాటు కారు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.మరో ఐదుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు వివరించారు. ఈ కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన షాద్‌నగర్ పోలీసులకు ఉన్నతాధికారుల చేత రివార్డులు అందిస్తామని తెలిపారు. సమావేశంలో శంషాబాద్ అడిషినల్ డీసీపీ రామ్‌కుమార్,షాద్‌నగర్ సీఐ విజయ్‌కుమార్ ఉన్నారు.