పోలీస్ కమిషనరేట్ల పునర్విభజనను వేగంగా పూర్తి చేసిన రాష్ట్ర సర్కార్.. సిబ్బంది విభజన ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తోందంటూ.. విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథంలోనే ఆయా పోలీస్ కమిషనర్ల మధ్య కొన్ని విషయాల్లో కోల్డ్‌వార్ సాగుతుందనే చర్చ ఆయా కమిషనరేట్ల పరిధిలో వినిపిస్తున్నాయి. గత నెల రోజుల కిందట హైదరాబాద్ పోలీస్ కమిషనర్,
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌కు సంబంధించిన కొందరు ఎస్సైల బదిలీలు చేయడం డిపార్ట్మెంట్లో తీవ్ర చర్చకు దారి తీసిందని తెలిసింది. తమ కమిషనరేట్ పరిధిలో ఎస్ఐల బదిలీని ఎలా చేస్తారంటూ ..మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బదిలీ అయిన వారిని రిలీవ్ చేయలేదని సిబ్బంది చర్చించుకుంటున్నారు. సిబ్బంది కేటాయింపులు అధికారికంగా పూర్తికాకపోవడంతో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ.. ఉన్నతాధికారులు సైతం వాపోతున్నారు.

Police
సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ) : మున్సిపల్ కమిషనరేట్ల తరహాలోనే పోలీస్ కమిషనరేట్లు ఉండాలనే పట్టుదలతో ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ చివరి వారంలో పోలీస్ కమిషనరేట్ల విభజన ప్రక్రియ పూర్తి చేసింది. అందులో భాగంగానే రాచకొండ పోలీస్ కమిషనరేట్ పేరును మారుస్తూ ‘మల్కాజిగిరి’ పేరుతో కొత్తగా పోలీస్ కమిషనరేట్‌ను ఏర్పాటు చేశారు. అలాగే ప్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌ను తెరపైకి తెచ్చారు. గతంలో ఉన్న రాచకొండ పోలీస్ కమిషనరేట్ నుంచి యాదాద్రి భువనగిరి జోన్‌ను తొలగించి, జిల్లా ఎస్పీని నియమించారు. అలాగే మహేశ్వరం జోన్‌ను తొలగించి చాల భాగాన్ని ఫ్యూచర్ సిటీలోకి కలిపేయగా, మహేశ్వరంలో జోన్‌లోని కొన్ని ఠాణాలు హైదరాబాద్‌లోకి మార్చారు.
అలాగే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కొన్ని ఠాణాలను మల్కాజిగిరిలోకి విలీనం చేశారు. అందులో కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఆయా ఠాణాలు ఉన్నాయి. సైబరాబాద్‌లోని కొన్ని ఠాణాలను హైదరాబాద్‌లోకి, అలాగే ఫ్యూచర్ సిటీలోకి మార్చారు. ఔటర్ లోపల మూడు పోలీస్ కమిషనరేట్లు, ఔటర్ అవతల ప్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిని నిర్ణయించి, కమిషనర్లను నియమించారు. ఆయా కమిషనరేట్లకు కావాల్సిన సిబ్బంది కేటాయింపుల కోసం ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇదంతా జరిగి ఆరు నెలలు పూర్తవుతున్నా, ఇప్పటి వరకు సిబ్బంది తాము ఏ కమిషనరేట్ పరిధిలో ఉన్నామో తెలియని అయోమయ స్థితిలో ఉన్నామంటూ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
పని ఒక చోట..జీతం మరో చోట..!
కమిషనరేట్ల పునర్విభజనతో కొన్ని ఠాణాల సరిహద్దులు మారాయి. అయితే అలాంటి వారు పాత కమిషనరేట్ నుంచే జీతాలు పొందుతున్నారు. అంటే పని ఒక కమిషనరేట్‌లో చేస్తూ, పక్క కమిషనరేట్ నుంచి జీతం పొందుతున్నారు. ఇలా చేయడంతో కొందరికి సాంకేతికంగా ఆర్ధిక పరమైన సమస్యలు ఎదురవుతున్నాయంటూ సిబ్బం ది చెబుతున్నారు. మల్కాజిగిరిలో పనిచేసే సిబ్బందికి కొన్ని అలవెన్స్‌లకు అవకాశాలున్నాయని, తాము మల్కాజిగిరిలో పనిచేస్తున్నా జీతం మాత్రం హైదరాబాద్ నుంచి వస్తుండడంతో అలవెన్స్‌లకు అవకాశం లేకుండా పోతుందని వాపోతున్నారు.
మొదలైన కోల్డ్‌వార్…!
సిబ్బంది కేటాయింపులు అధికారకంగా పూర్తికాకపోవడంతో కొన్ని విషయాలలో టాప్ బాస్‌ల మధ్య కోల్డ్ వార్‌కు దారితీస్తుందనే చర్చ జరుగుతుంది. గత నెల 9న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ 172 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అందులో మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఠాణాలు కూడా ఉన్నాయి. మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోకి వచ్చే కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఠాణాలకు సంబంధించిన ఎస్సైలు కూడా ఉన్నారు. వారిని మల్కాజిగిరి కమిషనర్ రిలీవ్ చేయలేదని సమాచారం.
విభజన జరిగిన ఆరు నెలల తరువాత కూడా పక్క కమిషనరేట్‌లోని ఎస్సైలను, ఇంకో కమిషనర్ బదిలీ చేయడం ఏంటనే విషయం డిపార్టుమెంట్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ అంశం ప్రభుత్వం వద్దకు కూడా వెళ్లినట్లు సమాచారం. ఇదొక్కటే కాకుండా, మరికొన్ని విషయాలలోనూ పూర్తి స్పష్టత లేకపోవడంతో ఏకంగా పోలీస్ కమిషనర్లు కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే వాదన విన్పిస్తోంది. సిబ్బంది కేటాయింపులకు సంబంధించిన ఏర్పాటైన కమిటీ నివేదికను కూడా ప్రభుత్వానికి పంపించినట్లు సమాచారం. అయితే అధికారికంగా ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ఎంత వేగంగా కమిషనరేట్ల పునర్విభజన చేశారో, అంతే వేగంగా సిబ్బంది కేటాయింపులు కూడా పూర్తి చేయాలని సిబ్బంది కోరుతున్నారు.