అసెంబ్లీ ఎన్నికల బరిలోకి కాలు దువ్వుతున్న పేరు మోసిన పార్టీలు ఇంకనూ అభ్యర్థుల ఖరారులో డక్కా ముక్కీలు తింటుండగా, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి, ప్రచారంలో దూసుకుపోతోంది. అభివృద్ధిపై, రానున్న ఎన్నికలపై ఎలాంటి తడబాటు, తత్తరపాటు లేకుండా బీఆర్ఎస్ పార్టీ ముందడుగు వేస్తూ రేపటి అభివృద్ధిని కాంక్షిస్తూ నవోదయం దిశగా పయనిస్తున్నది.
సిటీబ్యూరో, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ): ఎన్నికల ప్రచారంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) దూకుడు కొనసాగుతున్నది. విపక్ష పార్టీలు అభ్యర్థుల ఖరారులోనే తడబాటు పడుతుంటే బీఆర్ఎస్ మాత్రం పార్టీ అభ్యర్థులకు బీ-ఫాంలను అందజేసి ప్రచారంలో తనదైన పంథాను చాటుకుంటోంది. గ్రేటర్ 24 నియోజకవర్గాల్లోని పాతబస్తీ మినహా ఇతర అన్ని నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జిలు, చైర్మన్లు, కార్పొరేటర్లు పార్టీ రాష్ట్ర నాయకులు అభ్యర్థులకు మద్దతుగా నిలుస్తూ ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. ఇంటింటి ప్రచారం, పాదయాత్రలు ఒకవైపు, మరోవైపు కలిసివచ్చే నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తూ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారు. నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలతో క్యాడర్లో నూతనోత్తేజాన్ని నింపుతూ అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి అభ్యర్థుల గెలుపునకు బాటలు సుగమమం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పదేండ్ల అభివృద్ధి, ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టో ప్రచార అస్త్రంగా కాలనీలు, బస్తీలు కలియతిరుగుతూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ప్రధానంగా అన్ని వర్గాలు అభ్యర్థులకే మద్దతు అంటూ స్వచ్ఛంధంగా ముందుకు వస్తుండటం, ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తున్న తీరు పట్ల పార్టీ అభ్యర్థుల గెలుపు నల్లేరు మీద నడకేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థులు నియోజకవర్గంలో డివిజన్ల వారీగా ఇంటింటి పాదయాత్రకు ప్లాన్ చేసుకుని ఆ దిశగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రతి ఓటరుకు చేరువయ్యేలా బీఆర్ఎస్ అభ్యర్థులు క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. చేసిన అభివృద్ధిని, సంక్షేమంతో బీఆర్ఎస్ ప్రకటించిన మ్యానిఫెస్టో వివరిస్తూ స్థానికులతో మమేకం అవుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు 65 ఏండ్లు పాలించిన అభివృద్ధి జరగలేదని, గడిచిన పదేండ్లలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం వందేండ్ల అభివృద్ధికి బాటలు వేసిందంటూ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు. ఒకవైపు పాదయాత్రలు, మరో వైపు బూత్ లెవల్ ఏజెంట్లతో ప్రత్యేకంగా సమావేశమై భారీ మెజార్టీ లక్ష్యంగా అభ్యర్థులు ప్రచారంలో వేగాన్ని పెంచారు.