కొండాపూర్, మే 12: నాలతో పాటు కాలనీ రోడ్డు ఆక్రమించి అక్రమంగా ఫెన్సింగ్ వేసారంటూ గతంలో పలుమార్లు కూల్చివేతలు చేసిన అధికారులు ఇప్పుడు గమ్మున ఉన్నారు. గతంలో అక్రమం కాస్త ఇప్పుడు సక్రమం అయిందా? చందానగర్ సర్కిల్-21 పరిధిలోని చందానగర్ డివిజన్ కైలాస్ నగర్ నాలాను (Kailashnagar Nala) ఆనుకుని ఉన్న కాలి స్థలంలో ప్రైవేట్ వ్యక్తులు తమ ప్లాట్ అంటూ ప్రహరీతో ఫెన్సింగ్ వేశారు. విషయం తెలుసుకున్న ఇరిగేషన్, రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్ శాఖల అధికారులు అక్రమ నిర్మాణం అంటూ ప్రహరీ, ఫెన్సింగ్‌లను పలుమార్లు కూల్చివేశారు. కాగా సదరు వ్యక్తులు మరోసారి నిర్మాణాలు చేపట్టి, ఈ స్థలం తమదేనంటూ సూచిక బోర్డు పెట్టారు. ఈ విషయమై ఇరిగేషన్, టౌన్‌ప్లానింగ్ అధికారులను పలుమార్లు ప్రశ్నించగా.. పరిశీలిస్తాంటూ సమస్యను దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. అధికారుల సమ్మతంతోనే సదరు వ్యక్తులు బోర్డును ఏర్పాటు చేసుకుని కార్లు పార్కింగ్ చేసుకుంటున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.
లేఅవుట్లో ఓపెన్ స్పేస్‌గా..
చందానగర్ సర్వే నంబర్ 209 లో ఉన్న కైలాష్ నగర్ లేఔట్ లో నాలాను అనుకుని ఓపెన్ స్పేస్ ఉంది. కాగా 40, 41, 42 నంబర్ల ప్లాట్స్ తమవేనంటూ ప్రైవేటు వ్యక్తులు సదరు స్థలానికి ఫెన్సింగ్ వేసి గేట్ సైతం ఏర్పాటు చేశారు. ఇదివరకు ఇదే స్థలంలో ఏర్పాటు చేసిన కాంపౌండ్ వాల్, గేట్లను అధికారులు కూల్చివేశారు. మరోసారి సదరు స్థలాన్ని కబ్జా చేసి గేట్, కాంపౌండ్ వాల్ నిర్మించినప్పటికీ అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరించడంపై పలు అనుమానాలు రేకుతుతున్నాయి.
పరిశీలిస్తాం..
కైలాష్ నగర్ నాలాపై అక్రమంగా నిర్మించిన రిటైనింగ్ వాల్ నిర్మాణం, ఫెన్సింగ్ ఏర్పాటును మరోసారి పరిశీలించి రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్ అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ ఏఈ పావని చెప్పారు.