సిటీబ్యూరో, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ)/బేగంపేట : ప్రతి జోన్లో ఒక సైబర్, మహిళా ఠాణాను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. హాకా భవన్లో అదనంగా షీ టీమ్స్‌కు ఏర్పాటు చేసిన కొత్త విభాగాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఆధునిక వసతులతో 2000 చదరపు అడుగులలో షీ టీమ్స్ కార్యాలయం అందుబాటులోకి రావడంతో మరింత వేగంగా మహిళలకు సేవలు అందుతాయన్నారు. కొత్తగా ఆరు షీ టీమ్స్ బృందాలు ఏర్పాటు చేశామని, ప్రస్తుతం 15 బృందాలతో షీ టీమ్స్ ముందుకెళ్తున్నాయన్నారు. ఒక్కో బృందంలో ఒక ఎస్సై, నలుగురు పీసీలు 24 గంటలూ.. అన్ని జోన్లలో పనిచేస్తారని సీపీ తెలిపారు. షీ టీమ్స్ పనితీరు, కేసుల పరిష్కారంతో పోలీసు శాఖకు మరింత మంచి పేరు వస్తుందని అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ గజారావు భూపాల్, అదనపు డీసీపీ (షీ టీమ్స్, భరోసా ఇన్చార్జి) శిరీష పాల్గొన్నారు.
బేగంపేటలో మహిళా పోలీస్ స్టేషన్..
ఆపదలో ఉన్న మహిళల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పోలీస్ సిబ్బందికి సూచించారు. శుక్రవారం బేగంపేట మహిళా పోలీస్‌స్టేషన్ నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ (క్రైమ్) ఏఆర్ శ్రీనివాస్, జాయింట్ సీపీ గజారావు భూపాల్, ఉత్తర మండలం డీసీపీ చందనా దీప్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ స్టేషన్లో డిజిటల్ స్క్రీన్, ఐదు ఏవీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లో వివిధ విభాగాలను, గదులను సీపీ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బేగంపేట ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, మహిళా పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో శివశంకర్, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.