సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ): పోలీసులు అందిస్తున్న సేవలు ప్రజల్లోకి సక్రమంగా వెళ్తున్నాయా లేదా, పోలీసు సేవలపై ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారా లేదా తదితర అంశాలను తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు సేవలపై ప్రజాభిప్రాయం సేకరించేందుకు తెలంగాణ పోలీసు శాఖ తిరిగి శ్రీకారం చుట్టింది. బీఆర్ఎస్ హయాంలోనే ఫీడ్‌బ్యాక్ సెంటర్లు పనిచేశాయి. పోలీసు సేవలపై ఎప్పటికప్పుడు ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటూ పోలీసు సేవలను సంస్కరిస్తూ దేశంలోనే తెలంగాణ పోలీసును బెస్ట్ పోలీస్ అని నిరూపించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఫీడ్‌బ్యాక్ సెంటర్లు అటకెక్కాయి. దీంతో పోలీసు శాఖలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయనే ఆరోపణలు రావడం, నేరాలు సైతం పెరగడంతో కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి పాత విధానానికే జై కొట్టింది. ఇందులో భాగంగానే గురువారం డీజీపీ జితేందర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి, రాచకొండ కమిషనర్ సుధీర్‌బాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు..
పోలీసు సేవలపై ప్రజలు నిర్భయంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తపర్చవచ్చు. అందుకోసం పోలీసు శాఖ కొత్తగా క్యూఆర్ కోడ్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రజలు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు పోలీస్ స్టేషన్ల వివరాలు, ఇతర పోలీసు కార్యాలయాలు వంటివి డిస్ప్లే అవుతాయి. అంతేకాకుండా సిటిజన్ ఫీడ్‌బ్యాక్ కాల్ సెంటర్ ద్వారా కూడా నేరుగా ప్రజలు పోలీసు సేవలపై తమ అభిప్రాయాన్ని తెలియపర్చవచ్చు.
వీటిపైన అభిప్రాయాలు తెలియచేయవచ్చు:
పిటిషన్ సమర్పించడం
ఎఫ్ఐఆర్ నమోదు అంశంలో
ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్
ట్రాఫిక్ ఈ-చలాన్స్
పాస్‌పోర్ట్ వెరిఫికేషన్
ఇతర అన్ని రకాల పోలీసు సేవలు