ఉస్మానియా యూనివర్సిటీ, మే 7: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నంబర్ 7ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మనబోయిన సైదులు యాదవ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు.
ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జీవో నంబర్ 7 ప్రతులను చించివేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సైదులు యాదవ్ మాట్లాడుతూ జీవో నంబర్ 7 ద్వారా విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని, రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్రలో భాగంగానే ఈ జీవోను తీసుకువచ్చారని అనుమానం వ్యక్తం చేశారు. నిరసనలో విద్యార్థి నాయకులు చేరాల వంశీ, ప్రభాకర్, అనిల్, సాయికిరణ్, కుమార్, సంజయ్, శివ, అనిల్ నాయక్, నరేశ్, సురేశ్, అభి తదితరులు పాల్గొన్నారు.