మెహిదీపట్నం ఆగస్టు 21: తండ్రికి సేవలు చేయాల్సిన సమయంలో ఓ కూతురు ఇంట్లో నుంచి గెంటి వేసింది.తన బాగోగులు పట్టించుకోని కూతురు నుంచి ఇంటిని తనకు తిరిగి ఇప్పించాలని ఓ వృద్ధుడు హైదరాబాద్ కలెక్టర్‌ను ఆశ్రయించాడు.దీంతో వృద్ధుడికి ఇంటిని అప్పగించాలని కలెక్టర్ ఆదేశించడంతో ఆసిఫ్‌నగర్ తహసీల్దార్ గురువారం వృద్ధుడికి ఇంటిని అప్పగించారు. ఆసిఫ్‌నగర్ తహసీల్దార్ జ్యోతి వివరాల ప్రకారం.. ఆసిఫ్‌నగర్ మురాద్‌నగర్‌లో నివసించే సయ్యద్ అహ్మద్ అలీకి ముగ్గురు కూతుళ్లు. అతడి ఇంటిని భార్య చనిపోయే ముందు తన కూతురు ఇస్రా అహ్మద్‌కు వీలునామా రాసింది. ఇందులో తన భర్త చనిపోయే వరకు ఆయన పోషణ ఇస్రా అహ్మద్ చూడాలని పేర్కొంది.
కొన్ని నెలలుగా ఇస్రా అహ్మద్ తన తండ్రి పోషణను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ వస్తుంది. దీంతో సయ్యద్ అహ్మద్ అలీ తన ఇంట్లో తనకు చోటు కల్పించాలంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. స్పందించిన కలెక్టర్ పేరెంట్స్,సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 ప్రకారం ఇంటిని సయ్యద్ అహ్మద్ అలీకి అప్పగించాలంటూ ఆసిఫ్‌నగర్ తహసీల్దార్‌ను ఆదేశించారు. గురువారం సాయంత్రం తహసీల్దార్ జ్యోతి తన సిబ్బంది,పోలీసులతో మురాద్‌నగర్‌లోని సయ్యద్ అహ్మద్ ఇంటికి చేరుకోగా కూతురు ఇస్రా అహ్మద్ రెండు గంటల పాటు ఇంటి తాళాలను తీయకుండా గొడవ చేసింది. తహసీల్దార్ జ్యోతి తాళాలు తీయించి సయ్యద్ అహ్మద్ అలీకి ఇంటిని అప్పగించారు.