Hyderabad | మెహిదీపట్నం, ఫిబ్రవరి 26 : లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హుడా పార్క్ చెరువు శుభ్రం చేసే క్రమంలో బుధవారo తండ్రీకొడుకులు మృతి చందారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీహెచ్ఎంసీ అవుట్ సోర్సింగ్ సిబ్బంది మహమ్మద్ కరీం(38) లంగర్‌హౌస్‌లోని హుడా పార్క్ చెరువులో గుర్రపు డెక్క తీయడానికి వచ్చాడు. శివరాత్రి సందర్భంగా స్కూల్‌కి సెలవు ఉండడం వల్ల కరీం తన కొడుకు సాహిల్(15)ను తనతో పాటు తీసుకువచ్చాడు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో మహమ్మద్ కరీం తన కొడుకు సాహిల్‌తో కలిసి హుడా పార్క్ చెరువులోని గడ్డి శుభ్రం చేసే క్రమంలో సాహిల్ లోతైన ప్రాంతానికి వెళ్లడంతో అక్కడ బురదలో ఇరుక్కుపోయి తన తండ్రిని సహాయం కోరాడు. తన కుమారుడిని రక్షించుకునేందుకు తండ్రి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. తండ్రీకొడుకులు నీట మునిగిన విషయాన్ని ఇతర సిబ్బంది గమనించి ఎంటమాలజీ సూపర్వైజర్ రమేశ్‌కు సమాచారం అందించారు. పోలీసులు కూడా ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాలను వెలికితీసి.. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై కార్వాన్ ఎమ్మెల్యే ఆగ్రహం
ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహిద్దిన్ అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌసర్ మొహిద్దీన్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఎలాంటి సేఫ్టి ప్రీకాషన్స్ లేకుండా కనీసం లైఫ్ జాకెట్లు కూడా ఇవ్వకపోవడంతోనే ఇవాళ తండ్రీకొడుకులు మృతి చెందారన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం, పార్టీ తరపున సహకారం అందిస్తామన్నారు.