మెహిదీపట్నం, ఫిబ్రవరి 26 : లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లంగర్ హౌస్ హుడా పార్క్ చెరువును శుభ్రం చేసే క్రమంలో బుధవారం తండ్రీ కొడుకులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన ప్రకారం… లంగర్ హౌస్ లోని హుడా పార్క్ చెరువులో చెరువును శుభ్రం చేసే అవుట్ సోర్సింగ్ సిబ్బంది మహ్మద్ కరీం(38 ), బుధవారం చెరువులో గుర్రపు డెక్కను తీయడానికి వచ్చాడు. శివరాత్రి సందర్భంగా స్కూల్కు సెలవు ఉండటంతో కరీం తన కొడుకు సాహిల్(15 )ను తనతో పాటు తీసుకువచ్చాడు.
మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో కరీం తన కొడుకు సాహిల్ తో కలిసి హుడా పార్క్ చెరువులోని గడ్డిని శుభ్రం చేసే క్రమంలో సాహిల్ లోతైన ప్రాంతానికి వెళ్లడంతో అక్కడ బురదలో ఇరుక్కుపోయి తన తండ్రిని సాయం కోరాడు. తండ్రి కూడా వెళ్లి తన కొడుకు చెయ్యి పట్టి బయటకు తీసే క్రమంలో ఇద్దరు నీళ్లలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఇది గమనించిన ఇతర అవుట్ సోర్సింగ్ సిబ్బంది తమ ఎంటమాలజీ సూపర్వైజర్ రమేశ్ కు తెలిపారు.దీంతో అతడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రెండు మృతదేహాలను బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
అధికారులపై కార్వాన్ ఎమ్మెల్యే ఆగ్రహం
లోకల్ ఏరియా లీడర్లు చెప్పడంతో కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహిద్దిన్ అక్కడికి చేరుకున్నారు. దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి సమాచారం ఇవ్వడంతో అర్ధగంట వ్యవధిలో డీఆర్ఎఫ్ టీం ఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరు మృతదేహాలని వెలికి తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దిన్ మీడియాతో మాట్లాడుతూ.. గత కొంతకాలం నుంచి మేము జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్ ఖైరతాబాద్ తో ఎఫ్ టీ ఎల్ మెషిన్ గురించి ఎన్నోసార్లు అడగడం జరిగిందని, కమిషనర్ ఏదో సాకు చెప్పి ఎఫ్.టి.ఎల్ మెషిన్ ని మంజూరు చేయలేదని మండిపడ్డారు.
అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా కనీసం లైఫ్ జాకెట్స్ లు కూడా ఇవ్వకపోవడంతో ఈరోజు దురదృష్టకర సంఘటన జరిగిందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే పార్టీ తరఫున, ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి బాధితుల కుటుంబాలకు సహకారం అందిస్తామన్నారు. ఇది ఇలా ఉండగా.. ఒక బాధ్యత గల ఎంటమాలజీ సూపర్వైజర్ రమేశ్ 15 ఏండ్ల అబ్బాయిని ఈ పనిలోకి ఎట్లా పర్మిషన్ ఇస్తారని, ఎమ్మెల్యే దీనికి సంబంధించి ఉన్నతాధికారులతో మాట్లాడి సూపర్వైజర్పై చర్యలు తీసుకోవాలని కోరారు.