శామీర్‌పేట, జూలై 26 : అతి వేగంతో దూసుకెళ్లిన ఓ కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి డివైడర్‌ను దాటి బైక్‌ను, బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న యువతీయువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. బైక్‌పై వెనుక కూర్చున్న వ్యక్తికి తీవ్ర గాయాలై, పరిస్థితి విషమంగా మారింది.
బస్సులో ప్రయాణిస్తున్న వారికి ప్రమాదం తృటిలో తప్పింది. రోడ్డు దిగువకు వెళ్లి, ఆగిపోవడంతో 8 మందికి స్వల్ప గాయాలయ్యాయి. మిగితా వారంతా క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటన జీనోమ్ వ్యాలీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాజీవ్ రహదారిపై శుక్రవారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. తిరుమలగిరికి చెందిన మోహన్(26) కుటుంబం సింగాయిపల్లికి ఏడేండ్ల కిందట వచ్చి, స్థిరపడ్డారు. తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి ఉంటున్నాడు.
మోహన్ గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో బయటికి వెళ్లి వస్తానంటూ ఇంట్లో చెప్పి, ఇన్నోవా కారు తీసుకొని బయలు దేరాడు. మోహన్ పని చేస్తున్న కంపెనీలో మౌలాలీ నివాసి దీపిక(25) కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నది. వీరు కారులో (ఆమె ఎక్కడ కలిసిన విషయం తెలియదు) రాజీవ్ రహదారి మీదుగా మజీద్‌పూర్ చౌరస్తా దాటి గజ్వేల్ వైపు వెళ్లారు.
ఉదయం 8 గంటల సమయంలో అదే దారిలో తిరిగి వస్తుండగా.. లాల్గడీమలక్పేట అటవీ ప్రాంతం పరిధిలో అతివేగంగా రావడంతో కారు అదుపు తప్పింది. కారు పల్టీలు కొడుతూ డివైడర్‌ను దాటి శామీర్‌పేట నుంచి గజ్వేల్ వైపు వెళ్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. అంతటితో ఆగకుండా 40 మంది ఉద్యోగులతో వెళ్తున్న బయోలాజికల్ ఇంజినీరింగ్ బస్సును ఢీ కొట్టింది.
నుజ్జునుజ్జయిన కారు..
ఈ ప్రమాదంలో ఇన్నోవా కారు పూర్తిగా దెబ్బతిని.. రోడ్డు పక్కకు ఒరిగిపోయింది. మోహన్, దీపిక కారులో నుంచి ఎగిరి పడి, అక్కడికక్కడే మృతి చెందారు. లారెన్స్ కంపెనీలో పనిచేసే శశిధర్, శిబుదాస్ విధుల నిర్వహణకు బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బైకు వెనుక కూర్చున్న శిబుదాస్ తీవ్రంగా గాయపడ్డాడు.
బస్సుకు తప్పిన పెను ప్రమాదం
బస్సులో ప్రయాణిస్తున్న వారంతా ప్రమాదం నుంచి బయటపడ్డారు. తూంకుంటలోని బయోలాజికల్ ఇంజినీరింగ్‌లో పని చేస్తున్న 40 మంది ఆ బస్సులో ఉన్నారు. కారు బస్సు పైకి దూసుకు వస్తుండటంతో భయాందోళనకు గురైన డ్రైవర్ పక్కకు తప్పించే ప్రయత్నం చేశాడు. అయినా.. కారు వచ్చి బస్సును ఢీ కొట్టింది. దీంతో బస్సు రోడ్డు పక్కకు వెళ్లిపోయి.. ప్రధాన ద్వారం తెరవలేని పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా షాక్‌కు గురైన ఉద్యోగులు తేరుకొని, అత్యవసర ద్వారం గుండా బయటికి వచ్చారు. డ్రైవర్‌తో సహా 8 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ఘటనా స్థలానికి చేరుకున్న డీసీపీ కోటిరెడ్డి, ఏసీపీ రాములు, వెంకట్‌రెడ్డి, ట్రాఫిక్ సీఐ హనుమాన్ గౌడ్, జీనోమ్ వ్యాలీ సీఐ యాదగిరి రెండున్నర గంటల పాటు స్తంభించిన ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. క్షతగాత్రులను ఆర్వీఎం దవాఖానకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీపిక కంపెనీకి వెళ్లి విధులు నిర్వహిస్తుండగా, మోహన్ ఇంటి నుంచి పని చేస్తున్నాడు. గురువారం రాత్రి గచ్చిబౌలిలోని సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్లిన దీపిక.. ఉదయం మౌలాలీలోని ఇంటికి వచ్చినట్టు తెలిసింది. ఇంటికి వెళ్లిన ఆమె తానే తూంకుంట వరకు వచ్చిందా..? మోహన్ అక్కడికి వెళ్లి తీసుకువచ్చాడా? తెలియరాలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
మోహన్ కుటుంబ పరిస్థితి దయనీయం
తూంకుంట మున్సిపాలిటీ సింగాయిపల్లిలో స్థిరపడిన మోహన్ కుటుంబ పరిస్థితి దయనీయంగా ఉన్నది. మోహన్ తండ్రి శేఖర్ నగరంలో కేబుల్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. సోదరుడు గణేశ్‌కు మతిస్థిమితం సరిగాలేక మంచానికి పరిమితమై జీవిస్తున్నాడు. కుటుంబానికి ఆధారంగా ఉన్న మోహన్ మృతి చెందడంతో.. ఆ కుటుంబం అంతులేని విషాదంలో కూరుకుపోయింది.
గుంతలు తప్పించబోయి ప్రమాదం?
రాజీవ్ రహదారిపై కారు అదుపుతప్పిన ప్రాంతంలో రోడ్డు గుంతల మయంగా ఉన్నది. ఈ గుంతలను తప్పించుకునే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా ఇక్కడ ప్రమాదాలు జరిగినట్టు స్థానికులు తెలిపారు. వేగంగా వెళ్తున్న కారు.. గుంతను తప్పించే క్రమంలో అదుపుతప్పి డివైడర్ పైకి వెళ్లి ఉండవచ్చని భావిస్తున్నారు. గుంతలను సరి చేయడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు.