శేరిలింగంపల్లి, డిసెంబర్ 22 : ఖాజాగూడ లింకు రోడ్డుపై ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన బానోతు రామ్మోహన్, వినోద దంపతుల కుమారుడు బానోతు శ్రీరామ్(20) జోగిపేట పాలిటెక్నిక్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.
ఇండస్ట్రియల్ విజిట్ పేరిట తోటి క్లాస్‌మెట్స్‌తో కలిసి హైదరాబాద్‌కు వచ్చాడు. గురువారం మణికొండ ప్రాంతానికి చెందిన క్లాస్‌మెట్ దితేష్ ఇంట్లో ఉన్నాడు. శుక్రవారం ఉదయం సూర్యోదయం చూసేందుకు ఖాజాగూడ పెద్ద చెరువు వ్యూ పాయింట్‌కు వెళ్లారు. శ్రీరామ్‌తో పాటు జోగిపేట పాలిటెక్నిక్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న తోటి క్లాస్‌మెట్స్, స్నేహితులు మణికొండకు చెందిన దితేష్, రామాయంపేటకు చెందిన వర్షిత్, చందానగర్‌కు చెందిన కె.ఉదయ్‌సాయి, నారాయణ్‌ఖేడ్ ప్రాంతానికి చెందిన వంశీ కలిసి వ్యూ పాయింట్‌కు చేరుకున్నారు. అందరు కలిసి ఫొటోలు దిగుతూ ఆనందంగా గడిపారు. అనంతరం ఖాజాగూడ వైపు నుంచి గచ్చిబౌలి ఇంజినీరింగ్ కళాశాల వైపు కారులో వెళ్తుండగా.. మార్గమధ్యలో మలుపు వద్ద కారు అదుపు తప్పి.. డివైడర్‌ను ఢీకొని, రోడ్డుకు అవతలి వైపు పల్టీ కొట్టింది.
ఈ ఘటనలో ముందు సీట్లో ఉన్న బానోతు శ్రీరామ్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కారు డ్రైవింగ్ చేసిన కె. ఉదయ్ సాయి, కారులో వెనుకాల ఉన్న దితేష్(17), వర్షిత్, వంశీకి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని కేర్ దవాఖానకు తరలించారు. ఎదురుగా ఉన్న పిల్లిని చూసి సడన్‌గా బ్రేక్ వేయడంతో కారు అదుపు తప్పి పల్టీ కొట్టిందని ఉదయ్‌సాయి తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. అతివేగం, నిర్లక్ష్యంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ప్రమాద విషయం తెలుసుకున్న మాదాపూర్ ఏసీపీ శ్రీనివాస్, రాయదుర్గం ఇన్స్పెక్టర్ మహేశ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంలో మృతి చెందిన భానోతు శ్రీరామ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖాన మార్చురీకి తరలించారు.