సిటీబ్యూరో, ఏప్రిల్ 29(నమస్తే తెలంగాణ): ఒడిశా రాష్ట్రం నుంచి సికింద్రాబాద్‌కు అక్రమంగా గంజాయిని సేకరించి రవా ణా చేస్తున్న ఒడిశాకు చెందిన సునీల్ బింథాని అనే అంతర్రాష్ట్ర డ్రగ్‌పెడ్లర్‌ను సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, రాంగోపాల్‌పేట పీఎస్టీమ్ సంయుక్తంగా అరెస్ట్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుధీంద్ర తెలిపారు. ఒడిశాకు చెందిన సునీల్ బింథాని ఇంటర్‌ను మధ్యలోనే ఆపేసి తమిళనాడు, నాందేడ్‌లోని కాటన్ మిల్లులో పనిచేశాడు.
ఆ తర్వాత లాక్డౌన్ సమయంలో తన సొంతూరుకు వెళ్లిపోయి జీవనోపాధికోసం ఫాస్ట్‌పుడ్ సెంటర్ నడిపాడు. అధిక సంపాదన కోసం ఒడిశాలో గంజాయిని కొనుగోలు చేసి రైలులో సికింద్రాబాద్‌కు తీసుకొచ్చి ఇక్కడ అమ్మకాలు చేసేవాడని, ఈక్రమంలో రాణిగంజ్ ఎక్స్ రోడ్ వద్ద గంజాయి అమ్మే క్రమంలో పోలీసులు అరెస్ట్ చేశారు. సునీల్ బింథాని నుంచి 1110 గ్రాముల గంజాయి, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.