సిటీబ్యూరో, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ కాంగ్రెస్‌లో వర్గపోరు భగ్గుమంటున్నది. రౌడీలతో తమపై దాడులు చేయించేందుకు కుట్రలు చేస్తున్నారని సొంత పార్టీ నేతలే ఠాణా మెట్లెక్కడం చర్చనీయాంశం కాగా.. అధికార పార్టీ నేతల ఆధిపత్య పోరు నియోజకవర్గ ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నది. ఇప్పటికే అభ్యర్థి నవీన్‌యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్, ఆయన బాబాయ్‌పై రౌడీషీట్ ఉంది. అయితే రౌడీముద్ర ఉన్న అభ్యర్థి కోసం ప్రచారం ఎలా చేస్తామంటూ సీనియర్ నాయకులు, మంత్రులు సైతం మొండికేసిన ఘటనలున్నాయి. ఇది సద్దుమణగకముందే బోరబండలో కార్పొరేటర్ ఫసియుద్దీన్ రౌడీయిజంతో స్వయంగా షరీఫ్ వంటి సొంత పార్టీ సీనియర్ నేతకే రక్షణ కరువైతే సాధారణ కార్యకర్తల పరిస్థితి ఏమిటని పార్టీలో చర్చ జరుగుతున్నది.
బోరబండలో 74మంది రౌడీషీటర్లు
బోరబండ డివిజన్లో 74మంది రౌడీషీటర్లు ఉన్నారు. అందులో పలువురు సంగారెడ్డి నుంచి వచ్చి ఇక్కడ ఉన్న వారు సైతం ఉన్నారు. వీళ్లంతా కార్పొరేటర్ ఫసియుద్దీన్ అనుచరులని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలా తన వెంట 15మంది వరకు ఉంటారని, వీళ్లతోనే అటు సామాన్యులనే గాక సొంత పార్టీ నాయకులను కూడా బెదిరిస్తున్నాడని తెలుస్తున్నది. బీఆర్ఎస్ నాయకుడు సర్దార్‌ను ఇలాగే వేధించి పొట్టన పెట్టుకున్నాడని స్థానికులు అంటున్నారు. పోలీసులు కూడా రౌడీషీటర్లకే వత్తాసు పలుకుతుంటారని ఆ పార్టీ నాయకులే విమర్శిస్తున్నారు.
కాంగ్రెస్‌లో అసలైన నాయకులకు గుర్తింపు లేదని, ఫసియుద్దీన్ అసలైన కాంగ్రెస్ వాదులను వేధిస్తున్నాడంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా డివిజన్లోని పలువురు కాంగ్రెస్ నాయకులు షరీఫ్‌నకు మద్దతుగా నిలిచారు. బోరబండలో కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారు వర్గాలుగా చీలిపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అంటేనే రౌడీయిజాన్ని పోషిస్తున్నట్టుగా కనిపిస్తున్నదని, ఇలాంటి పార్టీ తమకొద్దంటూ స్థానికులు జోరుగా చర్చించుకుంటున్నారు.