మేడ్చల్ కలెక్టరేట్, జనవరి 10 : నాగారం డివిజన్ పరిధిలోని రాంపల్లిలో 70 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైడ్రా, పోలీసులు, జలమండలి అధికారులు మూకుమ్మడిగా ఆందోళన చేస్తున్న రైతులను అరెస్ట్ చేశారు. రాంపల్లి గ్రామంలోని సర్వే నెంబరు 388లోని 33 ఎకరాలను 70 ఏండ్లుగా రాంపల్లికి చెందిన దళిత, బీసీ రైతులు సాగు చేసుకుంటున్నారు. నాలుగు రోజుల కిందట నాలుగెకరాల భూమిని ఎలాంటి సమాచారం లేకుండా జలమండలి మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఫెన్సింగ్ వేసి, స్వాధీనం చేసుకున్నది.
ఆగ్రహించిన రైతులు ఫెన్సింగ్‌ను, హద్దురాళ్లను తొలగించారు. పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. శనివారం పోలీసు, జలమండలి, హైడ్రాలు తమ బలగాలతో వచ్చి, రైతులు సాగు చేసుకుంటున్న భూమిని స్వాధీనం చేసుకున్నారు. అడ్డుకున్న రైతులను అదుపులోకి తీసుకొని, వాహనంలో జవహర్‌నగర్‌కు పీఎస్‌కు తరలించారు. అంతకు ముందు అధికారులతో బాధిత రైతులు వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద రైతుల పొట్టగొడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, అరెస్ట్ చేసిన రైతులను సాయంత్రం విడుదల చేశారు.