10హెచ్‌పీ మోటర్లు భారం
కొండనాల్కకు మందేస్తే ఉన్ననాలిక ఊడిపోయిందన్నట్టు ఉంది కాంగ్రెసోళ్ల ఎవ్వారం. కేసీఆర్ ప్రభుత్వం ఇరవైనాల్గంటలూ కరెంటు ఇస్త్తుంటే రైతులు వద్దంటున్నారా. మూడుగంటలు మాత్రమే ఇయ్యమని అడిగినరా. తక్కువ టైము కరెంట్, ఎక్కువ హెచ్‌పీ మోటర్లు పెడితే పంటలు ఎక్కువ పండి తక్కువ ఖర్చుఅయితదా. 10హెచ్‌పీ మోటర్లు అనంగనే అవే రైతుల బోర్ల దగ్గరికి ఉరికొస్తయా. వాటికి పైసలు ఎవరియ్యాలె…ఉన్న బోర్లు, మోటర్లు ఏమి చెయ్యాలె. 3 గంటల కరెంట్‌తో వ్యవసాయం చేయడం సాధ్యం కాదని కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా తెలుసుకోవాలి. ఇప్పుడన్న ప్రభుత్వానికే మళ్లీ ఓటేసి గెలిపించుకుంటాం.
– ఈశ్వరయ్య, దుండిగల్, మేడ్చల్ జిల్లా
కౌల్దారీ విధానం వద్దు..
నానా రకాల వివరాలు, పేచీలు పెట్టి తిప్పుకొనే కౌల్దారీ పద్ధతిని కాంగ్రెస్ హయాంలో చూశాం. ధరణిని తొలగించి ఇబ్బందులు తీసుకొస్తాం అని కాంగ్రెస్ అంటే రైతులు ఒప్పుకొని ఓటెయ్యరు. పట్వారీ, కౌల్దారీ అమలులో కబ్జాదారులకు వీఆర్వోలు వంతపాడి రైతుకు నష్టం చేస్తరు. పైసలు ఇచ్చినోడిదే పొలం అనే పరిస్థితి వస్తది. న్యాయంగా జరగాల్సిన పనులకు పైరవీ చేయాల్సి వస్తది. గతంలో అధికారులు, ఆఫీసులచుట్టూ తిరిగినా పనులు జరుగలే. ప్రస్తుతం ధరణితో ఒకేచోట పనులన్నీ జరగడంతో రైతుకు నాలుగైదు చోట్ల తిరిగే అవసరం లేదు. మళ్లీ కేసీఆర్‌నే గెలిపించుకుంటే రైతులకు మంచి రోజులు కొనసాగుతాయి.
– అంజయ్య, డి.పోచంపల్లి, మేడ్చల్ జిల్లా
ఢిల్లీ పెత్తనం వద్దు..
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వచ్చేది ఇందిరమ్మ రాజ్యం కాదు ఢిల్లీ రాజుల పరిపాలన. అక్కడి సుల్తాన్ చెప్పే సలహాలే విని ఇక్కడ సామంతులు ప్రజలను అనాలోచితంగా పాలిస్తారు. రాష్ట్ర పరిస్థితిపై పూర్తి పట్టున్న కేసీఆర్‌కే ప్రజలు, రైతుల కష్టాలు తెలుస్తాయి. ఆయనే పదేండ్లుగా రైతులను అన్నివిధాలా ఆదుకుంటున్నారు. ఈసారి పెట్టుడి సాయం పెంచడంతోపాటు కొత్త పథకాలతో పేదరికాన్ని తగ్గిస్తామంటున్నారు. కాంగ్రెస్ అన్న మూడుగంటల కరెంట్, 10హెచ్‌పీ మోటార్లు, కౌల్దారీ పద్ధతి రైతులకు తీవ్రంగా నష్టం చేస్తాయి. మరింతకాలం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పాలన కొనసాగాలి.
– కృష్ణగౌడ్, దుండిగల్, మేడ్చల్ జిల్లా
వ్యవసాయం బంద్ అవుతది
కాంగ్రెస్ వస్తే వారు చెబుతున్నట్టు మూడుగంటలే కరెంట్ఇస్తే వ్యవసాయం ఎలా సాధ్యమైతది. భూములు తెగనమ్ముకుని కూలీలుగా మారి వ్యవసాయం బంద్ చేసుకోవాల్సిందే. ఇప్పుడిస్తున్న 24 గంటల కరెంట్‌తోనే పండ్లు, కూరగాయలు, వాణిజ్య పంటల దిగుబడి పెరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాల సాయంతో రైతులు విలువ పెరిగిన భూమిలో వ్యవసాయం వదలకుండా కొనసాగిస్తున్నరు. తెలంగాణ రాకముందు వచ్చే అరకొర కరెంట్ కోసం రాత్రింభవళ్లు పొలాలవద్ద కాపలా ఉంటిమి. 10 హెచ్‌పీ మోటార్లతో ఓవర్‌లోడ్ పెరిగి ట్రాన్స్ఫార్మర్లు, తీగలు కాలిపోతాయి. కేసీఆర్‌కే అండగా నిలిచి మరోసారి గెలిపించుకోవాలి.
– సంగయ్య, దుండిగల్, మేడ్చల్
మళ్లీ పట్వారీల పాలనొస్తది
కాంగ్రెస్ వస్తే ధరణిని తొలగించి పట్వారీ వ్యవస్థను మళ్లీ తెస్తుంది. ఊర్లల్లో పంచాయితీలు మొదలవుతాయి. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు లంచాలు ఇవ్వాల్సిందే. మండల ఆఫీసులో పైరవీకారులు లేనిదే పని జరుగదు. అవినీతి పెరిగిపోతుంది. రైతులు నేరుగా వెళ్లి పని చేసుకోలేరు. ధరణితో ఇప్పుడు ఒక్క రూపాయి లేకుండా రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు, కన్వర్షన్లు, పౌతి లాంటి ఎన్నో పనులు చక చకా జరిగిపోతున్నాయి. ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదు. రైతులకు మేలు చేసే కేసీఆర్ ప్రభుత్వమే మళ్లీ రావాలి.
– మల్లేశ్, బండ్లగూడ, దమ్మాయిగూడ
రైతు వ్యతిరేకి కాంగ్రెస్
రైతు వ్యతిరేక కాంగ్రెస్‌కు ఓటుతోనే గుణపాఠం చెప్పాలి. కాంగ్రెస్ హయాంలో ఉచిత కరెంటు ప్రకటించి పూర్తిగా మోసం చేసిండ్రు. 3 గంటలు మాత్రమే ఇచ్చి సుక్కలు చూపించిండ్రు. నెలకు రెండు సార్లు మోటర్లు కాలిపోయినయి. స్టాటర్లు పని చేయలే. పెండ్లాం పిల్లలను వదిలి పొలం కాడ పండుకున్నం. తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ రైతుల బాధలు తెలుసుకుండ్రు. వ్యవసాయానికి 24 గంటలు కరెంటు, రైతుబంధుతో సాయం జేస్తున్నరు. దీంతో ఉన్న పొలమంతా నాటుకున్న. పండిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వమే కొంటున్నది. కేసీఆర్ సారుకే రైతుల రైతుల మద్దతు ఉంటుంది.
– ఉదారి వేణుగోపాల్, ముదిరాజు
24 గంటల కరెంట్‌తో పంటల సాగు పెరిగింది
రైతులకు సీఎం కేసీఆర్ అందిస్తున్న 24 గంటల కరెంట్‌తో పంటల సాగు పెరిగింది. కాంగ్రెస్ మేం అధికారంలోకి వస్తే 3 గంటల కరెంటు ఇస్తాం… మళ్లీ పాత రోజులు తీసుకొస్తమంటున్నరు. గత కాంగ్రెస్ పాలనలో రైతుల బాధలు వర్ణణాతీతం. బావులు దగ్గర కాపు కాచి పొలానికి నీళ్లు పారబెడుతుండే. అయినా ఆ కరెంట్ సరిగా రాక పొలాలన్నీ ఎండుపోతుండే. కేసీఆర్ సార్ వచ్చినప్పటి నుంచి కరెంట్ బాగా ఇస్తుండు. ఇప్పుడు రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. రైతు బాంధవుడి వైపే మేముంటాం.
– శివరాత్రి లింగయ్య, రైతు,అన్నోజిగూడ
వ్యవసాయం మానుకోవాల్సిందే..
కాంగ్రెస్ పార్టీ మూడు గంటల కరెంట్ ఇస్తే రైతు వ్యవసాయం మానుకోవాల్సిందే. 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవడమంటే మళ్లీ ప్రతి రైతు ఆర్థికంగా నష్టపోవాల్సిందే. ట్రాన్స్ఫార్మర్లు, వైర్లు కాలిపోతే రైతులందరూ చందాలు వేసుకుని బాగు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంతా చేస్తే ఎకరం తడపాల్సిన చోట పావు ఎకరం కూడా నీళ్లు పారించలేని ఇబ్బందులు ఎదురవుతాయి. కాంగ్రెస్‌కు ఓటేసి మళ్లీ కష్టాలు తెచ్చుకోవాలా. రైతులతోపాటు ప్రజలందరూ ఏకమై మరోసారి బీఆర్ఎస్నే గెలిపించుకుంటాం. సొంత పాలన కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణ ప్రజల కష్టాలు ఇక్కడి నేతలకే తెలుస్తాయి.
– చంద్రయ్య, దుండిగల్
ఇందిరమ్మ రాజ్యం వద్దే వద్దు..
భూమికి సంబంధించిన లావాదేవిలన్నీ ధరణితో సులభంగా అవుతున్నాయి. కాంగ్రెస్ ధరణి ఎత్తేసి..కౌలుదారి విధానం తీస్తే మళ్లీ వీఆర్వోలు వస్తే కబ్జాలు, గొడవలు పెరిగిపోతాయి. గత పాలనలో భూముల విషయంలో చాలా మోసాలు జరిగాయి. రికార్డుల్లో ఇష్టం వచ్చినట్లు రాయడం, డబ్బులు ఇస్తే మార్పులు చేసేవారు. ఓ చోట రిజిస్ట్రేషన్ చేస్తే మరోచోట ఆన్లైన్ చేసేవారు. వివరాలు సరిగా లేవని పాసుబుక్కులు ఇచ్చేవారు కాదు. సమస్యలు తీర్చమని పైరవీకారులు, అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ధరణి వచ్చాక పనులు అవుతున్నాయి. ఇందిరమ్మ రాజ్యం వద్దే వద్దు. మరోసారి కేసీఆర్ సర్కారే రావాలి.
– రమేశ్, దుండిగల్
ధరణి రద్దుతో పాతరోజులొస్తయి
రైతులు భూమి పట్టాల కోసం, పహణి రికార్డుల కోసం తాసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ తీసుకొచ్చారు. ధరణి పోర్టల్ కారణంగా భూమి కొనడం, అమ్మడం ఈజీగా జరుగుతున్నాయి. పట్టా నకలు కూడా ఆన్లైన్లో క్షణాల్లో కొనుగోలు చేసిన వ్యక్తి మీదికి వస్తుంది. కాంగ్రెస్ నాయకులు ధరణిని రద్దు చేస్తామంటున్నారు. చేతితో రాసే పట్టాలతో అవకతవకలు జరిగి రైతులు గోస పడతారు. కాంగ్రెస్ కౌలు రైతుల కాలం తీసుకొస్తే ఆ భూములను కౌలు రైతులు తమ పేర్లపైకి మార్చుకునే ప్రమాదం ఉంటుంది. అందుకే ధరణి సేవలను కొనసాగించాలి. సీఎం కేసీఆర్ పాలననే రైతులు కోరుకుంటున్నారు.
– జక్కుల శ్రీనివాస్, గాంధీనగర్, జవహర్‌నగర్
కాంగ్రెస్ వస్తే రైతులకు కష్టాలే..
రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తే రైతులకు కష్టాలు తప్పవు. ధరణి తీసేస్తే మళ్లీ అవినీతి పెరిగిపోయి రైతులకు ఇబ్బందులు వస్తాయి. పాత రెవెన్యూ చట్టంతో గతంలో తాము అనేక ఇబ్బందులు పడ్డాం. ధరణి వల్లే తెలంగాణలో రైతులకు మేలు జరిగింది. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణితో రైతులు ఎలాంటి చింత లేకుండా ఉన్నారు. రైతులందరూ బీఆర్ఎస్ ప్రభుత్వానికే మద్దతివ్వాలి.
– కె.వెంకటేశ్, రైతు, రాంపల్లి
కౌలుదారి పద్ధతితో నష్టమే..
ధరణితో రైతులందరికీ మేలు జరిగింది. ఎవరి భూములు వారి పేరు మీద సురక్షితంగా ఉన్నాయి. మళ్లీ వంద రకాల వివరాలు రాసుకునే కౌలుదారి పద్ధతి తీసుకొస్తామని కాంగ్రెస్ అంటే రైతులు ఎవరూ అందుకు ఒప్పుకోరు. కబ్జాదారులకు రెవెన్యూలో కిందిస్థాయి వీఆర్వోలు ఎలా సహకరించేవారో ఎలా మర్చిపోతాం. ప్రతి పనికీ పైరవీ చేయాల్సి వచ్చేది. ఆఫీసుల చుట్టూ తిరిగినా పనులు జరిగేవి కాదు. ధరణితో ఒకేచోట పనులన్నీ జరగడంతో పాటు పాసుబుక్కులు ఇంటికి వస్తున్నాయి. కాంగ్రెస్ వస్తే వాళ్లలో వాళ్లు పోట్లాడుకోవడమే సరిపోతుంది. ప్రజలకు మేలు చేయాలంటే మరోసారి కేసీఆర్‌కే అధికారం అప్పగించాలి. కౌలుదారి, మూడు గంటల కరెంట్ మాకొద్దు.
– కృష్ణ, దోమడుగు