ఖైరతాబాద్, జనవరి 18: రోడ్డు ప్రమాదంలో తాము మరణించినా తమ అవయవాలను దానమిచ్చి ఓ రైతు, ఓ ప్రైవేటు ఉద్యోగి మరికొందరికి పునర్జన్మనిచ్చారు. జీవన్‌దాన్ నోడల్ అధికారి డాక్టర్ శ్రీభూషణ్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా చేగొమ్మ మండల కేంద్రానికి చెందిన బుర్రా మహేశ్ (25) ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 15న తన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా, మరో బైకు వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహేశ్‌ను ప్రైవేట్ దవాఖానలో చేర్పించగా, ఈ నెల 17న బ్రెయిన్‌డెడ్‌కు గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యులను కలిసిన జీవన్‌దాన్ ప్రతినిధులు అవయవదానం విశిష్టతను వివరించగా అందుకు అంగీకరించారు. కాలేయం, రెండు మూత్రపిండాలను సేకరించినట్లు డాక్టర్ శ్రీభూషణ్ రాజు తెలిపారు.
ఆరుగురికి జీవనదానం..
యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మాల్గ నవీన్ (35) రైతు. ఈ నెల 9న ద్విచక్రవాహనంపై వెళ్తుండగా, మోటకొండూరు వద్ద ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నవీన్‌ను ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించగా, చికిత్స అందిస్తున్న వైద్యులు ఈ నెల 17న బ్రెయిన్‌డెడ్‌కు గురైనట్లు నిర్ధారించారు. జీవన్‌దాన్ ప్రతినిధుల సూచనల మేరకు అవయవదానానికి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. కాలేయం, ఒక మూత్రపిండం, ఊపిరితిత్తి, గుండె, రెండు కార్నియాలను వైద్యులు సేకరించారు.