సిటీబ్యూరో, అక్టోబర్ 26(నమస్తే తెలంగాణ): సైబర్‌నేరగాళ్లు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌కే షాకిచ్చారు. సైబర్‌నేరాలపై నిరంతరం ప్రజలకు అవగాహన కల్పిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన సజ్జనార్ ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టుకుని నేరగాళ్లు నకిలీ వాట్సప్ ద్వారా ప్రజలకు మెసేజ్‌లు పంపుతున్నారని తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఆయన ట్వీట్ చేశారు. తన పేరుతో వస్తున్న మెసేజ్‌లకు ఎవరూ స్పందించవద్దని, అలాంటి నెంబర్లను వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ కొట్టాలని ఈ సందర్భంగా సజ్జనార్ సూచించారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ సైబర్ నేరగాళ్లకు తమ వ్యక్తిగత వివరాలు ఇవ్వవద్దని, ఎవరైనా ఆరోపణలు చేసినా, డబ్బులు డిమాండ్ చేసినా, బెదిరించినా భయపడకుండా వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సజ్జనార్ పేర్కొన్నారు.