శంషాబాద్ రూరల్, మే 15 : నకిలీ వీసాలు తయారు చేసి.. కువైట్‌కు పంపిస్తున్న ముఠా పట్టుబడింది. గురువారం శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్‌గౌడ్ వివరాలు వెల్లడించారు. నకిలీ వీసాలతో ఎనిమిది మంది మహిళలు కువైట్ వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు రాగా, అనుమానం వచ్చి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో చిలుకూరి బాలాజీ, శివకుమార్ అనే ఏజెంట్లు వీరికి నకిలీ వీసాలు ఇచ్చినట్లు తేలింది. అవుట్ పోస్టు..ఎస్వోటీ పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకొని విచారించారు.
ఆసిఫ్‌నగర్‌కు చెందిన రామంజనేయులు, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన చిలుకూరి బాలాజీ, అన్నమయ్య జిల్లా చెందిన శివకుమార్, కడప జిల్లాకు చెందిన గోపాల్ ముఠా సభ్యులుగా ఏర్పడినట్లు గుర్తించారు. పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన చదువురాని వారితో పాటు పేద వర్గాలకు చెందిన వారిని గుర్తింపు గల్ఫ్ దేశాలకు వెళితే అధిక డబ్బులు వస్తాయని ఆశచూపుతున్నారు.
నకిలీ వీసాలు తయారు చేయడంతో పాటు వారి వద్ద నుంచి డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నట్లు తేలింది. చిలుకూరు బాలాజీ, సంకర శివకుమార్‌ను రిమాండ్‌కు తరలించగా, మిగతా వారిని కోసం గాలిస్తున్నారు. నిందితుల నుంచి ట్యాంపర్డ్ పాస్‌పోర్టులు 14, గల్ఫ్‌దేశాల వీసాలు 14, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి మస్కట్ వెళ్లే టికెట్లు వంటివి స్వాధీనం చేసుకున్నారు.